కలం, వెబ్ డెస్క్: వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రమంతా చీకటిమయం అయిందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామినేడు సమీపంలో “రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం” నినాదంతో ఏర్పాటు చేసిన కూటమి విజయోత్సవ సభలో (Tirupati Meeting) సీఎం పాల్గొని ప్రసంగించారు. తన రాజకీయ ప్రయాణం ఈ తిరుపతిలోనే మొదలు పెట్టానని సీఎం గుర్తు చేశారు. ఇక్కడే పుట్టానని.. తనకు పునర్జన్మ ఇచ్చిన ఏడుకొండల వాడి చెంత ఈ సభ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రధాన మంత్రిగా 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న మొత్తమొదటి నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచి నేటికీ 2 ఏళ్ళు అయిందని చెప్పారు. 2024 ఎన్నికల్లో మోడీ, పవన్ కల్యాణ్, తాను కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని కోరితే ప్రజలు గెలిపించారని అన్నారు. తాను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నానని.. 57 శాతం ఓట్ షేర్ తో 94 శాతం సీట్లు ఇచ్చిన ఘటన ఆంధ్ర దేశ ప్రజానీకానిదని కొనియాడారు.
సభా వేదికగా గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. గతంలో 2014నుంచి 2019 మధ్య రాష్ట్రంలో ఎక్కడ చూసినా చీకటి అలుముకుందని మండిపడ్డారు. 2014లో రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టపోయామని అన్నారు. వైసీపీ హయాంలో 2019-24లో రాష్ట్రం విధ్వంసం అయిందని ఫైర్ అయ్యారు. దీనివల్ల రాష్టంలోని అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొందని.. వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. 2019లో ప్రజావేదిక కూచివేతతో మొదలైన ఈ విధ్వంసం రాష్టాన్ని విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాల్లో దేశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిందని.. కానీ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు.

