కలం, వెబ్ డెస్క్: బీజేపీ జూరాల ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకుల హౌస్ అరెస్టులు దుర్మార్గమమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతులను కలిసేందుకు వెళ్తే తప్పేముందని ప్రశ్నించారు. అటు ఎంపీ డీకే అరుణ (DK Aruna) సైతం రాంచందర్ రావు అరెస్టు తీవ్రంగా ఖండించారు. రైతులకు సాగునీరు అందించాలంటే.. సంకెళ్లు వేస్తారా? నిర్బంధిస్తారా? అంటూ నిలదీశారు. రాంచందర్ రావుతో పాటు అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులందరిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు? అని ప్రశ్నించారు. బీజేపీ శ్రేణుల ఆందోళనలు మరింత ఉదృతం కాకముందే, తక్షణమే రైతాంగానికి సాగునీరు అందించాలని పేర్కొన్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ సందర్శనకు పార్టీ నాయకులతో కలిసి వెళ్లిన రాంచందర్ రావు (Ramchander Rao Arrest)ను పోలీసులు అడ్డుకున్నారు. జడ్చర్ల వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. రాంచందర్ రావును వెంటనే విడిచిపెట్టాలనిపోలీసుల వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ.. తమ కష్టాలు చూడండి అంటూ రైతులు మమ్మల్ని పిలిచారని అన్నారు. ఎల్నినో ప్రభావం ఉంటే ముందే మరో పంట వేసుకోవాలని రైతులను చెప్పాలని.. పంట వేసిన తర్వాత నీళ్లు ఇవ్వకపోతే ఎలా? అంటూ నిలదీశారు. రైతాంగానికి సాగునీళ్ళు ఇచ్చేవరకు రైతుల ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందని.. ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు.

