కలం, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ (Balochistan)లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో రెండు వైపులా భారీ స్థాయిలో ప్రాణాలు బలవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే దాదాపు 250 మందికి పైగా చనిపోయారు. ఇందులో పాక్ సైనికులు, బీఎల్ఏ సభ్యులతోపాటు సాధారణ ప్రజలూ ఉన్నారు. మహిళలు, చిన్నారులు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) శనివారం ఒకేసారి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని 12 నగరాలు/పట్టణాల్లో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో ఆత్మాహుతి దళం సైతం పాల్గొన్నట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన వీడియోను సోమవారం విడుదల చేసింది. ఇందులో బలూచ్ ఆత్మాహుతి దళంలోని ఓ మహిళ పాక్ ఆర్మీపై కాల్పులు జరపడం చూడొచ్చు. ఆమె కాల్పులు జరుపుతుండగా మరో మహిళ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే, పాక్ ఆర్మీ ఎదురు కాల్పుల్లో మహిళా యోధురాలు చివరికి మరణించింది. ఇందులో చనిపోయిన ఆమె పేరు హవా బలోచ్ అని, ఆమె బలూచిస్థాన్ విముక్తి కోసం అమరురాలైందని బీఎల్ఏ సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ క్రమంలో హవా బలోచ్ ఆఖరిగా మాట్లాడిన మాటల వీడియో, ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
పాక్ సైన్యం పిరికిది..
చనిపోవడానికి ముందు హవా బలోచ్ మాట్లాడిన వీడియోల ఏముందంటే.. “పాక్‌సైన్యం పిరికిది. మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే బలూచ్ యోధుల్ని ఏమీ చేయలేక.. ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోంది. బలూచ్ ప్రజలారా మేల్కోండి. మనకు ఇంతకు మించిన దారి ఇంకొకటి లేదు” అంటూ తుపాకీ పట్టుకొని, చిరునవ్వుతో మాట్లాడింది. పాక్ ఆర్మీపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె చనిపోయింది.
కాగా, బలూచిస్థాన్ (Balochistan) విముక్తి కోసం కొన్ని దశాబ్దాలుగా పాక్ ఆర్మీతో బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో గతేడాది ‘హెరోఫ్1’ పేరుతో కాల్పులు, ఆత్మాహుతి దాడులు చేసింది. ఇప్పుడు ‘హెరోఫ్2’ పేరుతో భారీ స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇందులో ముఖ్యంగా మహిళా ఆత్మాహుతి దళాలు పాక్ సైన్యాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఘర్షణల్లో గత రెండు రోజుల నుంచి వందలమంది బలయ్యారు.
Read Also: ఏఐ మరో దెబ్బ.. అమెజాన్ బాటలో ఒరాకిల్!
Follow Us On: Sharechat


