కలం, కరీంనగర్ బ్యూరో : వ్యక్తిగత పర్యటనలో భాగంగా నేడు కరీంనగర్ (Karimnagar) నగరానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జల శక్తి శాఖ క్యాబినెట్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్‌ను నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా స్వతంత్ర దేవ్ సింగ్, మేయర్, డిప్యూటీ మేయర్ మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, స్థానిక సంస్థల పాత్ర, మౌలిక వసతుల విస్తరణ, తాగునీటి నిర్వహణ, స్మార్ట్ సిటీ భావన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పట్టణాభివృద్ధిలో ప్రజాప్రతినిధుల బాధ్యత వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అనంతరం మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ప్రశంసించారు. ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు. దేశంలోని అభివృద్ధి చెందుతున్న పోటీ నగరాల సరసన నిలిచే సామర్థ్యం కరీంనగర్‌కు ఉందన్న ఆయన.. . నగర అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు చూపుతున్న నిబద్ధత అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో కరీంనగర్ మరింత ఆదర్శ నగరంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నగరంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి వ్యక్తం చేసిన యూపీ క్యాబినెట్ మంత్రి.. స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని అభినందించారు.
భేటీలో భాగంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ నగరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను యూపీ క్యాబినెట్ మంత్రికి వివరించారు. ఆధునిక రహదారులు, వరద నివారణ ప్రాజెక్టులు, స్మార్ట్ మౌలిక వసతులు, మల్టీ లెవల్ ట్రాఫిక్ పరిష్కారాలు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థలు, పర్యావరణ హిత కార్యక్రమాలు, ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించే దిశగా నగరంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.కరీంనగర్‌ను రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఆదర్శవంతమైన, పోటీ సామర్థ్యం కలిగిన అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం, ఆధునిక రవాణా వ్యవస్థ, సమర్థవంతమైన పౌర సేవలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలోని ప్రముఖ నాయకులు కరీంనగర్ అభివృద్ధిని అభినందించడం నగర ప్రజలందరికీ గర్వకారణం అని అన్నారు. అనంతరం యూపీ క్యాబినెట్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ కరీంనగర్ ప్రజలు చూపిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నగరం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏపీపీ చంద్ర, బీజేపీ నాయకులు భారీ జితేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

