చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రత, నిఘా అవసరం : పశువైద్య అధికారి

కలం, మిర్యాలగూడ : రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన భద్రత, నిరంతర నిఘా అవసరమని నల్లగొండ జిల్లా పశుసంవర్ధక, పశువైద్య శాఖ అధికారి డాక్టర్ జి.వి. రమేష్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మిర్యాలగూడ (Miryalaguda) పరిధిలోని ఆలగడప అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్, వాడపల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌లతో పాటు అవంతిపురం పశువుల సంతను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు కీలక సూచనలు చేసిన ఆయన.. బక్రీద్ నేపథ్యంలో జిల్లాలోని ఆరు ముఖ్యమైన చెక్‌పోస్టుల వద్ద పోలీసు, పశువైద్య సిబ్బందిని షిఫ్టుల వారీగా 24 గంటల పాటు విధుల్లో నియమించినట్లు పేర్కొన్నారు.

ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి

చెక్‌పోస్టుల ద్వారా రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధీకృత పశువైద్యుడి ధ్రువీకరణ పత్రాలు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. లారీలపై, ఇతర వాహనాలలో పరిమితికి మించి పశువులను క్రూరంగా లోడ్ చేసి తరలిస్తే, అటువంటి వాహనాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవంతిపురం పశువుల సంతను పరిశీలించిన జిల్లా అధికారి.. సంతకు వచ్చే పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్లప్పుడూ పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పశువుల సంరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకటరెడ్డి, స్థానిక పశువైద్యులు డాక్టర్ రమాదేవి, డాక్టర్ స్వప్న, డాక్టర్ శశికళ, ఇతర పశువైద్య సిబ్బంది, చెక్‌పోస్ట్ పోలీసులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>