కలం, స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్‌లో (Commonwealth Games) భారత్‌కు ఎన్నో పతకాలు అందించిన బ్యాడ్మింటన్ (Badminton).. ఈసారి కనిపించదు. 2026లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ను తొలగించారు. దీంతో భారత్ తన బలమైన పతకాల విభాగాన్ని కోల్పోనుంది. వాస్తవానికి 2026 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆస్ట్రేలియాలోని విక్టోరియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ ఆర్థిక కారణాలతో 2023లో ఆతిథ్య బాధ్యతల నుంచి తప్పుకుంది. ఆ తర్వాత స్కాట్లాండ్ ముందుకొచ్చింది. తక్కువ ఖర్చుతో గేమ్స్ నిర్వహించాలనే ఉద్దేశంతో కొన్ని క్రీడలను తొలగించింది. వాటిలో బ్యాడ్మింటన్ కూడా ఉంది.
భారత్‌కు ఇది పెద్ద దెబ్బ
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ (Badminton) భారత్‌కు అత్యంత విజయవంతమైన క్రీడల్లో ఒకటి. ఇప్పటివరకు ఈ విభాగంలో భారత్ 31 పతకాలు గెలిచింది. వాటిలో 10 స్వర్ణాలు, 8 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లోనే భారత షట్లర్లు ఆరు పతకాలు సాధించారు. అందులో మూడు స్వర్ణ పతకాలు ఉన్నాయి. 1966 కింగ్‌స్టన్ కామన్వెల్త్ గేమ్స్‌లో దినేశ్ ఖన్నా కాంస్య పతకం సాధించి భారత బ్యాడ్మింటన్ ఖాతా తెరిచారు. 1978లో ప్రకాశ్ పదుకొణె పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు.
అదే టోర్నీలో అమీ ఘియా, కన్వాల్ ఠాకూర్ సింగ్ మహిళల డబుల్స్‌లో కాంస్యం గెలిచి భారత మహిళల బ్యాడ్మింటన్‌కు తొలి కామన్వెల్త్ పతకం అందించారు. 1982లో సయ్యద్ మోదీ మరో స్వర్ణం సాధించారు. 1998లో పుల్లెల గోపీచంద్ కాంస్యం, అపర్ణ పొపట్ రజతం గెలిచారు. పురుషుల జట్టు రజతం, మహిళల జట్టు కాంస్యం కూడా భారత్ ఖాతాలో చేరాయి.
సైనా నుంచి సింధు వరకు స్వర్ణ యుగం
2002లో అపర్ణ పొపట్ మరో కాంస్యం సాధించారు. 2006లో చేతన్ ఆనంద్, మిక్స్‌డ్ టీమ్ కాంస్యాలు అందించాయి. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ భారత బ్యాడ్మింటన్‌కు మలుపు తిప్పాయి. సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు. జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప మహిళల డబుల్స్‌లో స్వర్ణం అందించారు. పారుపల్లి కశ్యప్ కాంస్యం, మిక్స్‌డ్ టీమ్ రజతం గెలిచాయి.
2014లో కశ్యప్ స్వర్ణం సాధించగా, గురుసాయి దత్, పీవీ సింధు కాంస్యాలు గెలిచారు. జ్వాలా-అశ్విని జోడీ రజతం సాధించింది. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మిక్స్‌డ్ టీమ్ స్వర్ణం గెలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా నెహ్వాల్ స్వర్ణం, పీవీ సింధు రజతం సాధించారు. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించారు. అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి మహిళల డబుల్స్‌లో కాంస్యం అందించారు.
2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ స్వర్ణాలు గెలిచారు. మొత్తం ఆరు పతకాలతో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు నిరంతరం పతకాలు అందించిన బ్యాడ్మింటన్ ఈసారి లేకపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. పతకాల పరంగా అత్యంత బలమైన విభాగం లేకుండానే గ్లాస్గో 2026లో భారత్ బరిలోకి దిగనుంది.
Read Also: యువతలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు.. అసలు కారణమిదే!
Follow Us On : WhatsApp

