కలం, వెబ్ డెస్క్ : భారత స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లీ (Virat Kohli) ని పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ వెనక్కు నెట్టి.. నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో బాబర్ అజమ్ ఈ చారిత్రక రికార్డు నెలకొల్పాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక అర్ధ శతకాలు చేసిన బ్యాటర్‌గా ఆయన అగ్రస్థానానికి చేరాడు. ఈ మ్యాచ్‌తో భారత్‌కు చెందిన విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును బాబర్ అధిగమించాడు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ అజమ్ 36 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇది ఆయన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 39వ అర్ధ శతకం కావడం విశేషం. గతంలో కోహ్లీ 38 హాఫ్ సెంచరీలతో ఈ రికార్డును కలిగి ఉండగా, ఆయన 2024లో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఈ అర్ధశతకం సాయంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తీవ్రంగా తడబడింది. 16.5 ఓవర్లలోనే 96 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పాకిస్థాన్ 111 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇది ఆస్ట్రేలియాకు టీ20ల్లో ఇదే అతిపెద్ద ఓటమి.
పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ నాలుగు ఓవర్లలో 19 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. షాహీన్ షా అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో పాకిస్థాన్ ఆస్ట్రేలియాపై 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఫలితం టీ20 ప్రపంచకప్ 2026కు ముందు పాకిస్థాన్‌కు మంచి ఆత్మవిశ్వాసాన్ని అందించిందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.


