కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్ రావు (Harish Rao) ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే ఉద్దేశంతో తనపై దుష్ప్రచారం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ రావు, టీపీసీసీ మీడియా కన్వీనర్ సామా రామ్మోహన్ రెడ్డిలకు హరీశ్ రావు తన న్యాయవాదుల ద్వారా నోటీసులు జారీ చేశారు.
ఇటీవల అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి తెలంగాణలో వర్షాలు పడకూడదని, రాష్ట్రంలో కరువు రావాలనే ఉద్దేశంతో హరీశ్ రావు దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేశారని హరీశ్ రావు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తనతో పాటు బీఆర్‌ఎస్ పై చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్టం, ఇతర సంబంధిత చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హరీశ్ రావు హెచ్చరించారు.

