కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్మల్ (Nirmal) జిల్లా లక్ష్మణచాంద మండలం బాబాపూర్ గ్రామస్థులు స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలోని పిల్లలను ఇక నుంచి ప్రైవేట్ పాఠశాలకు పంపబోమని తీర్మానం చేశారు. ఊరిలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుండటంతో పాటు విద్యార్థుల సంఖ్య పెరిగితే అభివృద్ధికి మరింత దోహదపడుతుందని గ్రామ సర్పంచి పడిగెల లక్ష్మి అభిప్రాయపడ్డారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెబుతారని.. తద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అలాగే ఆయా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. కాగా బాబాపూర్ గ్రామస్థుల నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.

