కలం, వెబ్ డెస్క్ : మలేషియా (Malaysia) రాజధాని కౌలాలంపూర్‌లో నిన్న జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భారత్ రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు (KTR) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, పార్టీ అధినేత కే. చంద్రశేఖర రావు (KCR) మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుత అధికార పక్షం, రాజకీయ ప్రత్యర్థులపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రచారాలు, అబద్ధాలతో తెలంగాణ సాధించిన అభివృద్ధిని కనుమరుగు చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్ర, అభివృద్ధి, నీటి వనరులు, ఆర్థిక పురోగతిపై కనీస అవగాహన లేని కొందరు ‘నాలుగడుగుల నాయకులు’ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం కలిసిరానప్పుడు సాదాసీదా జీవులు కూడా త్రాచుపాముల్లా బుసలు కొడతాయని, ప్రజలు ఇలాంటి రాజకీయ కోబ్రాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతి దేశంలోనే ఎక్కడా లేదని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. ఒకప్పుడు వలసలు, కరవుతో అల్లాడిన తెలంగాణను కేసీఆర్ భారతదేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా మార్చారని కొనియాడారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, పారిశ్రామిక రంగాలలో తెలంగాణ సాధించిన విజయాలే కేసీఆర్ దూరదృష్టితో కూడిన నాయకత్వానికి నిదర్శనమన్నారు. జ్ఞానం, ఆవిష్కరణలు, ముందస్తు ఆలోచన ఉన్న సమాజాలదే భవిష్యత్తు అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఎదుగుదల, పరివర్తన కోసం బీఆర్ఎస్ పార్టీ వద్ద ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉందని వెల్లడించారు. రాష్ట్రం కోసం కేసీఆర్ ఊహించిన విజన్‌తో సరితూగగల ప్రణాళిక మరే ఇతర రాజకీయ పార్టీకీ లేదని ఆయన స్పష్టం చేశారు.

