కలం, వెబ్‌డెస్క్: దేశంలో పలు రాష్ట్రాల్లో నేటితో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ఆసక్తికర చర్చకు తెరలేపాయి. వీటన్నింటిలో ప్రముఖ సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా (Axis My India) వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు (Tamil Nadu)లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఏకంగా 98 నుంచి 120 స్థానాలను కైవసం చేసుకొని అధికార పీఠాన్ని అధిరోహించబోతోందని ఈ సంస్థ అంచనా వేసింది. ఇక తమిళనాడులో దశాబ్ద కాలంగా సాగుతున్న డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల ద్వంద పోరాటానికి ముగింపు పలుకుతూ విజయ్ (Vijay) ప్రభంజనం ఖాయమని, తమిళనాడులో రాజకీయ సునామీ రాబోతుందని ఈ సర్వే రిపోర్టు తెలియజేస్తోంది.
కొత్తగా పార్టీ పెట్టి, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోరాటంతో బరిలో దిగిన విజయ్ దక్షిణాది రాజకీయాల్లో మాజీ సీఎం ఎన్టీఆర్ నాటి చరిత్రను తిరగరాస్తాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సౌత్‌లో సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి బడా స్టార్లకు సాధ్యం కాని విక్టరీ విజయ్ ఖాతాలో పడబోతోందని అంచనా వేస్తున్నారు. ఈ రిపోర్టు నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో ఇది భారీ మార్పునకు నాంది పలుకుతుందని చర్చ నడుస్తోంది. యాక్సిస్ మై ఇండియా రిపోర్ట్ ప్రకారం డీఎంకే 92 నుంచి 110 స్థానాలు, ఏఐఏడీఎంకే 22 నుంచి 32 స్థానాలకు పరిమితం కానున్నాయి.

