కలం, మహబూబ్నగర్ బ్యూరో: నేటి అర్ధరాత్రి నుంచి తలపెట్టిన ఆటో డ్రైవర్ల బంద్ (Auto Drivers Strike)ను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ఆటో సంఘాల జేఏసీ సమావేశం జరిగింది .ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్, సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, బిఆర్టియూ ఆటో యూనియన్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 24వ తేదీ నుంచి జరిగే ఆటో డ్రైవర్ల నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వెహికల్ డ్రైవర్స్ వ్యతిరేకంగా తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని, ప్రమాదాలు జరిగితే డ్రైవర్లే కారణమని యావజ్జీవ శిక్షలు వేయడానికి చట్టం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, చార్జీలు పెంచాలని, మోటార్ వెహికల్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చి ఆటో డ్రైవర్లు కార్మికులే కాదని చెప్పే విధానం తెచ్చారని, ఈ విధానాన్ని కార్మిక లోకం అంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సమ్మె చేసే హక్కు లేకుండా పోరాటాన్ని నిర్విర్యపరిచే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వెంటనే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు .సోమవారం నుంచి జరిగే నిరవధిక సమ్మెకు ప్రజలు,రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ సమ్మెకు మద్దతుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇందులో సిఐటియు జిల్లా అధ్యక్షులు దిప్లా నాయక్ , టిఎన్టియుసి నాయకులు ధన్వాడ రాములు, సిఐటియు నాయకులు రాజ్ కుమార్ ,నాగేష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

