కలం, వెబ్ డెస్క్ : ట్రాఫిక్ చలాన్ల సొమ్మును వాహనదారుల బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా కట్ చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి కనీసం రాజ్యాంగంపై అవగాహన లేదని, ఆయన మాటలు అజ్ఞానానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రజల వ్యక్తిగత ఆస్తి హక్కులను హరించే అధికారం ముఖ్యమంత్రికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన కాకుండా ‘అనుముల రాజ్యాంగం’ నడుస్తోందని దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఎద్దేవా చేశారు. పింఛన్లు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను ఆటో క్రెడిట్ చేయడంలో విఫలమైన ప్రభుత్వం, కేవలం పేదల సొమ్మును దోచుకోవడానికే ఆటో డెబిట్ విధానాన్ని తీసుకురావాలని చూడటం దారుణమన్నారు. చలాన్లు వేసే ముందు రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు. ఆటో డెబిట్ కాదు.. అది ఆటో దోపిడీ అని విమర్శించారు. సీఎం వాడుతున్న కార్ల మీద కూడా మూడు చలాన్లు ఉన్నాయని, నోరు జారినందుకు రేవంత్ రెడ్డికి కూడా చలాన్లు వేయాలా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే ప్రతి మాటకూ చట్టబద్ధత ఉండాలని, అలా కాకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రభుత్వం ఒక జోకర్‌గా మిగిలిపోతుందని శ్రవణ్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలు తుగ్లక్ నిర్ణయాలను తలపిస్తున్నాయని, ఇష్టం వచ్చినట్లు అకౌంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తే కోర్టులు ఊరుకోవని స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రికి ఐదు పేజీల బహిరంగ లేఖ రాస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రాహుల్ గాంధీ ఒకవైపు పేదలకు డబ్బు ఇవ్వాలని చెప్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం పేదల ఖాతాల నుంచి సొమ్మును దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడి విద్యార్థుల జీవితాలను బలి ఇచ్చారని ఆరోపించారు. సీఎం ధర్మకర్తగా ఉండాలి కానీ, రాక్షసుడిగా మారి ప్రజలను పీడించకూడదని హితవు పలికారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప, ఇలాంటి మూర్ఖత్వపు ఆలోచనలు మానుకోవాలని సూచించారు.


