ఇళ్లు ఇస్తున్న సర్కారు.. కూల్చేస్తున్న ఆఫీసర్లు

కలం, కరీంనగర్ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma House) పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. పేదలకు ఇండ్లు కేటాయిస్తున్నది. అయితే కొన్ని చోట్ల అధికారుల తీరుతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకున్నది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నిర్మాణదశలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ (Karimnagar Corporation) పరిధిలో ఇటువంటి ఘటనే చోటు చేసుకున్నది. 58వ డివిజన్ బోయవాడ (దోబివాడ) కాలనీలో‌ మంగ అనే నిరుపేద మహిళకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. గతంలో అదే స్థలంలో ఆమెకు పాత ఇల్లు ఉండేది. ఆ ఇల్లు శిథిలావస్థకు చేరి కూలిపోయింది. మంగ భర్త చనిపోగా ఆమె కుటుంబం కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఇటీవల అధికారులు ఆమె కట్టుకుంటున్న ఇందిరమ్మ ఇంటిని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు. మున్సిపల్ ఏసీపీ వేణు, డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి బేస్‌మెట్ గోడను అన్యాయంగా కూల్చివేశారని బాధితురాలు బోరుమంటోంది.

బడా వ్యాపారవేత్త ఒత్తిడితోనేనా?

తనకు ఉన్న 60 గజాల స్థలంలోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నట్టు బాధితురాలు మంగ చెబుతున్నది. అయితే పొరుగునే ఉన్న బడావ్యాపారవేత్త అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి కూల్చివేశారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సదరు మహిళకు 14 ఫీట్లు ఉండగా రిజిస్ట్రేషన్ పత్రాలపై 12 ఫీట్లు పట్టా ఉంది. అయితే ఆమె హద్దు ప్రకారంగా 13 ఫీట్లలో 60 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇంటి (Indiramma House) నిర్మాణాన్ని ప్రారంభించింది. అప్పటికే ఆ పాత ఇంటికి ఆనుకునే బడా వ్యాపారవేత్త ఇల్లు నిర్మించుకుంటున్నట్టు సమాచారం. ఆ మహిళ ఇంటిని కట్టుకుంటే తన ఇంటికి వాస్తు చెడిపోతుందనే కారణంతోనే ఇంటిని కూల్చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సదరు బడా వ్యాపారవేత్త ఆ ఖాళీ స్థలాన్ని తనకు విక్రయించాలని ఓ కార్పొరేటర్‌తో బాధిత కుటుంబంపై ఒత్తిడి చేయించినట్టు సమాచారం. బాధిత కుటుంబం వినకపోగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం దశలో అధికారుల సహాయంతో కూల్చివేయించినట్టు బాధితులు బోరుమంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచం ఇవ్వలేదన్న అక్కసుతో ఇందిరమ్మ ఇళ్లు కూల్చివేశారంటూ బాధితురాలు మంగ వాపోయింది. వెంటనే తనకు న్యాయం చేయాలని కోరుతోంది. బాధితురాలు తమ స్థలం కంటే పక్కవారి స్థలంలోకి రెండు ఫీట్ల మేర జరిగి ఇంటిని నిర్మిస్తుండటంతోనే కూల్చివేశామని అధికారులు అంటున్నారు.

కారకులపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ

ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు న్యాలపట్ల రాజు, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరమ్మ ఇంటి ప్రహరీగోడను కూల్చిన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబంతో మాట్లాడారు. పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటే భరించలేని స్థితిలో ప్రజాప్రతినిధులు ఉండడం సిగ్గుచేటు అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా కూల్చివేశారన్నారు.

Read Also: తమిళ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ.. TVK, NDA పొత్తుకు కీలక చర్చలు!

Follow Us On: Youtube

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>