కలం వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా(Australia) క్రికెట్ మాజీ టెస్ట్ స్టార్ డామియన్ మార్టిన్(Damien Martyn) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చేరిన అతను ప్రస్తుతం కృత్రిమ కోమా(coma)లో ఉన్నారు. అతనికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్న మెనింజైటిస్(Meningitis) నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 1992 నుంచి 2006 వరకు ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించిన మార్టిన్, గత వారం బాక్సింగ్ డే రోజున అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే పరిస్థితి క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మెనింజైటిస్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న పొరల్లో వచ్చే తీవ్రమైన వాపుగా వైద్యులు చెబుతున్నారు. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉండటంతో అత్యంత జాగ్రత్తగా వైద్యం కొనసాగుతోంది. మార్టిన్ (Damien Martyn) పరిస్థితిపై మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పందించారు. “అతనికి అత్యుత్తమ చికిత్స అందుతోంది. అమాండా, కుటుంబసభ్యులకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ప్రార్థనలు చేరుతున్నాయి,” అని తెలిపారు.
మాజీ కోచ్ డారెన్ లీమన్ కూడా భావోద్వేగ సందేశం పంపారు. “బలంగా ఉండండి, పోరాడండి లెజెండ్. కుటుంబానికి నా ప్రేమ,” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. స్ట్రోక్ ప్లేలో అపూర్వమైన నైపుణ్యం చూపిన మార్టిన్, స్టీవ్ వా నేతృత్వంలోని అజేయ ఆస్ట్రేలియా జట్టులో కీలక స్థానం సంపాదించారు. 67 టెస్టుల్లో 13 సెంచరీలు నమోదు చేసి 46.37 సగటుతో కెరీర్‌ను ముగించారు.
2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌పై 88 పరుగులు నాటౌట్‌గా సాధించిన ఇన్నింగ్స్ ఇప్పటికీ క్రికెట్ అభిమానుల జ్ఞాపకాల్లో చెరిగిపోని ఘట్టంగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో రికీ పాంటింగ్‌తో కలిసి విజయం దిశగా జట్టును నడిపించారు. 2006 యాషెస్ సిరీస్ సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మార్టిన్, ఆ తర్వాత మీడియాకు దూరంగా జీవితం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
Read Also: భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్
Follow Us On: Youtube


