కలం, వెబ్ డెస్క్: అస్సాం (Assam)లో ఎన్నిలకు ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మంత్రి, హఫ్లాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే నందితా గోర్లోసా (Nandita Gorlosa) బీజేపీకి, తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను అస్సాం బీజేపీ (BJP) అధ్యక్షుడు దిలీప్ సైకియాకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె, తనను ఇతర బాధ్యతల నుంచి వెంటనే తప్పించాలని కోరారు. తన పదవీ కాలంలో ప్రజలకు, పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించినందుకు, తనకు సహకరించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
నందితా గోర్లోసా రాజీనామా అస్సాం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. హఫ్లాంగ్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, పార్టీలో కీలక నాయకురాలిగా గుర్తింపు పొందారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే తదుపరి ఆమె రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకేసారి మంత్రి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు ఏప్రిల్ 9న అస్సాంలో ఒకేసారి 126 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ముందు కీలక నేత రాజీనామా చేయడం బీజేపీకి కొంత నష్టం కలిగించే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

