కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల (Asian Games) బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్లు సంచలన ప్రదర్శనతో స్వర్ణ హ్యాట్రిక్ సాధించారు. శుక్రవారం జరిగిన పురుషుల 80 కేజీల ఫైనల్ పోరులో కొరియాకు చెందిన మిన్‌సియాంగ్ కిమ్‌పై అంకుశ్ పంగాల్ 4-0తో ఘనవిజయం సాధించి భారత్‌కు మూడో పసిడి పతకాన్ని అందించారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో అంకుశ్ ఆరంభం నుంచే పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు. మొదటి రౌండ్‌ను 4-1తో గెలుచుకున్న ఆయన, రెండో రౌండ్‌లో ఏకగ్రీవంగా 5-0తో విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకున్నారు.
మూడో రౌండ్‌లోనూ అదే జోరు కొనసాగించి 4-1తో రౌండ్‌ను కైవసం చేసుకుని స్వర్ణాన్ని ముద్దాడారు. అంతకుముందు మహిళల విభాగంలోనూ భారత బాక్సర్లు అద్భుత విజయాలు సాధించారు. 75 కేజీల ఫైనల్లో లవ్లీనా బొర్గోహైన్ చైనాకు చెందిన జియీ బావోను 5-0తో ఓడించారు. తన 29వ పుట్టినరోజునాడే ఈ విజయం సాధించిన లవ్లీనా, ఆసియా క్రీడల్లో పసిడి గెలిచి తనకు తాను ఉత్తమ కానుక ఇచ్చుకున్నట్లు చెప్పారు.
అలాగే మేరీ కోమ్ తర్వాత ఆసియా క్రీడల్లో (Asian Games) స్వర్ణం సాధించిన రెండో భారత మహిళా బాక్సర్‌గా నిలిచారు. మరో ఫైనల్లో పర్వీన్ హుడా 65 కేజీల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య విజేత చెన్ నియెన్-చిన్‌పై 3-2తో గెలిచి తొలి ఆసియా గోల్డ్ సాధించారు. వీరిద్దరి విజయాలతో మహిళల బాక్సింగ్‌లో భారత్‌కు 12 ఏళ్ల స్వర్ణ నిరీక్షణ ముగిసింది. ఇప్పటికే ప్రియ, కపిల్, నరేందర్ కాంస్య పతకాలు సాధించడంతో ఈ సారి బాక్సింగ్ విభాగంలో భారత జట్లు అత్యుత్తమ ప్రతిభను కనబరిచాయి.

