కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ తీర్మానం మేరకు అక్టోబర్ 2ను ‘పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం’గా పాటిస్తూ, పాలమూరు (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు (Journalists) శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి తమ వినతిపత్రాన్ని సమర్పించారు.
డిజిటల్, ప్రసార రంగాల విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో సమగ్ర ‘మీడియా కమిషన్’ ఏర్పాటు చేయాలని, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తేవాలని, కొత్త కార్మిక కోడ్‌లతో దెబ్బతిన్న 1955, 1958 నాటి చట్టబద్ధమైన రక్షణలను పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేశారు. అలాగే 2007 తర్వాత వేతన సవరణలు లేకపోవడంతో, వెంటనే నూతన వేతన మండలి (వేజ్ బోర్డు)ని ఏర్పాటు చేయాలని కోరుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపే వినతిపత్రం ప్రతిని ఇక్కడ ఆవిష్కరించారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టుల ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రతినిధులు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందించాలని, రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్ణయ్యతో పాటు టీయూడబ్ల్యూజే/ఐజేయూ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కాటం నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, కోశాధికారి రఘు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రతినిధులు రవీందర్ గౌడ్, వెంకటయ్య, మణి, గోకులం వెంకటేష్, ఆల సందీప్ రెడ్డి, ఆర్వ విజయ్ ,నాగరాజు,రహేమాన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

