భారత షూటర్ల ప్రయాణ తిప్పలు!

కలం, స్పోర్ట్స్ : జపాన్‌లోని ఐచి-నాగోయాలో ఆసియా గేమ్స్ (Asian Games) ప్రారంభమవుతున్న వేళ, భారత షూటింగ్ బృందానికి (Indian Shooting Team) ప్రయాణ తిప్పలు ఎదురవుతున్నాయి. హోటల్ నుంచి పోటీలు జరిగే వేదిక చాలా దూరంగా ఉండడంపై జట్టు సీనియర్ కోచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆతిథ్య దేశం నుంచి తాను మెరుగైన ఏర్పాట్లు ఆశించానని, కానీ ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా ఉందని ఆయన ఆవేదన చెందారు. జపాన్ చేరుకున్న 30 మంది సభ్యుల భారత షూటింగ్ బృందానికి శిక్షణ వేదిక నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో వసతి కల్పించారు.

క్రీడాకారులు వేర్వేరు హోటళ్లలో ఉంటుండడంతో ప్రతిరోజూ శిక్షణ కోసం సుదీర్ఘ సమయం ప్రయాణానికే సరిపోతోంది. మను భాకర్, ఈషా సింగ్ వంటి పతక ఆశలున్న అగ్రశ్రేణి షూటర్లు దీనివల్ల రోజూ తెల్లవారుజామునే లేచి దూరప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది. రవాణా వ్యవస్థ తీవ్ర సమస్యగా మారిందని, హోటళ్లు దగ్గరగా ఉంటే సమయం ఆదా అయ్యేదని కోచ్ అభిప్రాయపడ్డారు.

ఈ విషయాన్ని జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. షూటింగ్ రేంజ్‌లు సాధారణంగా నగరాలకు దూరంగానే ఉంటాయని, గతంలో చైనా ఆసియా గేమ్స్‌లోనూ గంట ప్రయాణం పట్టేదని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ జపాన్ నిర్వహణ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని స్పష్టం చేశారు. క్రీడాకారులు ఈ ఇబ్బందులను అధిగమించి పోటీలపై దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>