అశ్వాపురంలో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వివాదం!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం (Ashwapuram) మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. అంబేద్కర్ విగ్రహ తొలగింపు ఘటన వివాదానికి దారి తీసింది. అశ్వాపురం మండల పరిధిలోని ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు ఆకస్మికంగా తొలగించారు. ముందస్తు సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని తొలగించడంపై దళిత సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

దళిత సంఘాల నిరసన

​ఈ ఘటనకు నిరసనగా బుధవారం మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో దళిత సంఘాలు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించాయి. వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వానికి, అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహం అనేది కేవలం ఒక విగ్రహం కాదని, అది దళిత, బహుజనుల ఆత్మగౌరవానికి, రాజ్యాంగ హక్కులకు ప్రతీక అని పేర్కొన్నారు.

విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించాలి

ఈ ఆందోళనలో దళిత సంఘాల నాయకులు వేర్పుల నరేష్, పోడుతూరి కళ్యాణ్ బాబు, తదితరులు పాల్గొని ప్రసంగించారు. తొలగించిన అశ్వాపురం ప్రధాన రహదారి కూడలి వద్దే ప్రభుత్వ లాంఛనాలతో,  సగౌరవంగా మరల పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించి కాలయాపన చేస్తే, ఈ ఆందోళనలను జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  జరగబోయే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.  విగ్రహ పునః ప్రతిష్ఠపై స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు వెనక్కి తగ్గేదే లేదని దళిత సంఘాలు స్పష్టం చేయడంతో మణుగూరులో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Read Also: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఇదిగో ఫ్రీ యాప్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>