కలం, స్పోర్ట్స్ : జింబాబ్వేతో హరారే వేదికగా జరుగుతున్న తొలి T20 మ్యాచ్‌లో భారత యంగ్ పేసర్ అశోక్ శర్మ (Ashok Sharma) అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. ప్రాక్టీస్ పిచ్‌లలో మంచి బౌన్స్ కనిపించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సిరీస్ కోసం భారత్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. దాంతో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లతో కలిసి కొత్త బంతినందుకునే అవకాశాన్ని అశోక్ శర్మ దక్కించుకున్నారు.
భారత తుది జట్టు:
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.
రైతు బిడ్డ నుంచి టీమిండియా టోపీ వరకు…
జయపూర్ సమీపంలోని రాంపూర్ అనే ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మ ప్రయాణం ఎంతో కష్టంతో కూడుకున్నది. ఆయన తండ్రి ఒక సాధారణ రైతు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో కుటుంబంలో ఒక్కరిని మాత్రమే క్రికెట్లో ప్రోత్సహించగల పరిస్థితి ఉండేది. దాంతో జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడిన ఆయన అన్నయ్య అక్షయ్ శర్మ, తమ్ముడి కల కోసం తన ఆటను వదులుకున్నారు. కుటుంబం చేసిన త్యాగాలు, అశోక్ శ్రమ కలసి ఆయనను 2025-26 దేశవాళీ సీజన్లో వేగంగా ఎదుగుతున్న పేసర్‌గా నిలబెట్టాయి.
ఐపీఎల్లో మెరుపులు
2025-26 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అశోక్ శర్మ సంచలనం సృష్టించారు. కేవలం 10 మ్యాచ్‌లలోనే 22 వికెట్లు తీసి టోర్నీలోనే అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచారు. క్రమం తప్పకుండా గంటకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతులు విసరడం ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించారు. ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆయనను రూ. 90 లక్షలకు సొంతం చేసుకుంది. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా మార్గదర్శకత్వంలో అశోక్ తన వేగంతో మరింత ఆకట్టుకున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్‌కు గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి, ఆ ఐపీఎల్ సీజన్లోనే అత్యంత వేగవంతమైన బంతిని నమోదు చేశారు. ఆ సీజన్లో 6 మ్యాచ్‌లే ఆడినప్పటికీ 6 వికెట్లు పడగొట్టి తన ముద్ర వేశారు.

