కలం, వెబ్ డెస్క్: ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Asannagari Jeevan Reddy) పార్టీ మారబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారబోతున్నానన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. ’నేను జీవితంలో ఎప్పుడూ బీఆర్ఎస్‌ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను‘ అని ఆయన స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరుతున్నానని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
అంతా తప్పుడు ప్రచారం
రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేనివారే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీవన్ రెడ్డి (Asannagari Jeevan Reddy) వాపోయారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం ఈ కుట్ర సాగిస్తున్నారని పేర్కొన్నారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ (KCR) అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని (Pralhad Joshi) ఢిల్లీలో కలిసినట్టు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని స్పష్టం చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
Read Also: మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. ఖర్గేకు నోటీసులు
Follow Us On: Instagram

