కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా అటవీ ప్రాంతంలో రాష్ట్ర క్యాబినెట్ భేటీ (Cabinet Meeting) జరగబోతున్నది. ఒకప్పుడు మావోయిస్టుల కదలికలు ముమ్మరంగా ఉన్న ప్రాంతంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య లేదన్న సంకేతాన్ని ఇవ్వడానికే ఇక్కడ సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్నదా?.. లేక రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని చెప్పదల్చుకున్నదా?.. లేక మంత్రులు, అధికారులందరికీ మేడారం జాతర (Medaram Jatara) దర్శనం కల్పించే ఉద్దేశమా?… ఇలాంటి అనేక రకాల చర్చలకు ప్రభుత్వ నిర్ణయం తావిచ్చింది. ముఖ్యమంత్రి మొదలు మొత్తం మంత్రివర్గం, అన్ని శాఖల అధికారుల బృందం క్యాబినెట్ భేటీకి హాజరవుతుండడంతో పోలీసులు మూడు రోజుల నుంచే పరిసర ప్రాంతాలను కూంబింగ్ చేస్తూ జల్లెడ పడుతున్నారు. క్యాబినెట్ భేటీకి సుమారు మూడు వేల మంది పోలీసు భద్రత ఏర్పాటైంది.
మంత్రి సీతక్క కనుసన్నల్లో ఏర్పాట్లు :
మేడారం జాతర పర్యవేక్షణ, ఏర్పాట్ల బాధ్యతను ఆ ప్రాంతానికి చెందిన మంత్రి సీతక్క (ములుగు నియోజకవర్గం) చూస్తున్నారు. గత పది రోజులుగా ఆమె ప్రతీ అంశాన్ని అధికారులతో రివ్యూ చేస్తున్నారు. క్యాబినెట్ భేటీకి అవసరమైన ఏర్పాట్లలోనూ ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతానికి నక్సలైట్ల హడావిడి లేకపోయినా కర్రెగుట్టల ఎన్‌కౌంటర్ తర్వాత చత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన కొన్ని దళాలు, కొందరు సీనియర్ నాయకులు ఈ పరిసర ప్రాంతాల్లోన మకాం వేసి ఉన్నారని గత కొన్ని వారాలుగా వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్ జరిగితే గంటల వ్యవధిలోనే పార్టీ తరఫున ప్రకటనలు ఈ ప్రాంతం నుంచే వస్తున్నాయి. రాష్ట్ర పోలీసులకూ మావోయిస్టులు మకాం వేశారనే సమాచారం అందుతున్నా ఎలాంటి హింసాత్మక చర్యలకు ఆస్కారం లేకుండా పోలీసు శాఖ అప్రమత్తమైంది.
అడుగడుగునా ఇంటెలిజెన్స్ నిఘా :
మేడారం జాతర (Medaram Jatara) ఏర్పాట్లు ప్రారంభం కావడంతో దాదాపు రెండు కోట్ల మంది ఆదివాసీ భక్తులు వస్తారనే అంచనాతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీనికి తోడు ఇప్పుడు స్టేట్ క్యాబినెట్ భేటీ కూడా ఖరారు కావడంతో నిఘా వర్గాలు మరింత అలర్ట్ అయ్యాయి. నాలుగైదు రోజుల ముందు నుంచే గ్రేహౌండ్స్, యాంటీ నక్సల్ బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఏ చిన్న కదలిక వచ్చినా ఇంటెలిజెన్స్ వర్గాలు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తం మేడారంలో మకాం వేస్తున్నందున ఏ చిన్న సంఘటన జరిగినా అది పెను ప్రమాదానికి దారితీస్తుందనే పకడ్బందీ ఆలోచనతో ఊహకు అందని తీరులో పోలీసుల నిఘా కొనసాగుతున్నది. క్యాబినెట్ భేటీ జరిగే హరిత ప్లాజా భవనంతో పాటు మంత్రులు బసచేసే తాత్కాలిక టెంట్లు, పరిసర ప్రాంతాలన్నీ నిఘా నీడలోకి వెళ్ళాయి.
చత్తీస్‌గఢ్ సరిహద్దుపై స్పెషల్ ఫోకస్ :
ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి భక్తుల రూపంలో వచ్చే మావోయిస్టులను గుర్తించడంపైనా రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ములుగు, ఏటూరునాగరం, వాజేడు, వెంకటాపురం.. ఇవన్నీ ఇవి నక్సల్ ప్రభావిత ప్రాంతాలే కాక చత్తీస్‌గఢ్ సరిహద్దుతో సంబంధం ఉన్నవి. కొద్దిరోజుల క్రితం తుపాకీ కాల్పుల మోతలతో, ఎన్కౌంటర్లతో హోరెత్తింది. పదుల సంఖ్యలో నక్సలైట్లు హతమైన కర్రెగుట్టలు ఇక్కడకు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల అలజడి లేకుండా ప్రశాంతంగానే ఉన్నా ఎలాంటి అలికిడి, చడీ చప్పుడూ లేకుండా ఆకస్మిక దాడులు చేసేందుకున్న అవకాశాలపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మేడారానికి సమీపంలోని కాల్వపల్లి గ్రామానికి చెందినవాడే. ఈయనతో పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కూడా ఈ ప్రాంతంలోనే మకాం వేసినట్లు వార్తలు వినిపిస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిశితంగా సమాచారాన్ని సేకరిస్తున్నది.
Read Also: ఆ మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి..
Follow Us On: Instagram


