కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్ ‘మార్ ఎ లాగో’(Mar a Lago)లో ఆదివారం సాయుధుడు చొరబడడం కలకలం సృష్టించింది. సకాలంలో గుర్తించిన భద్రతా దళాలు దుండగుడిని మట్టుబెట్టాయి. స్థానిక కౌంటీ షెరీఫ్ చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి(తెల్లారితే ఆదివారం) 1.30 సమయంలో షాట్‌గన్, ఆయిల్ క్యాన్ పట్టుకున్న వ్యక్తి నార్త్ గేట్ వద్ద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కంట పడ్డాడు. వెంటనే, అప్రమత్తమై అతడిని కాల్చి చంపారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చి, పరిశీలించి దుండగుడు నార్త్ కరోలినాకు చెందిన యువకుడిగా గుర్తించారు. ఆ యువకుడికి 20 ఏళ్ల లోపు వయసుంటుంది. అతడు కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదంటూ వాళ్ల కుటుంబం ఫిర్యాదు చేసిన విషయం పోలీసులు తెలుసుకున్నారు.
కాగా, ట్రంప్‌కు వింటర్ వైట్హౌస్గా పేరు పెందిన మార్ ఎ లాగో(Mar a Lago) నివాసం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ ఒడ్డున ఉంది. వీకెండ్స్‌లో ఇక్కడ ట్రంప్ కుటుంబంతో గడుపుతుంటారు. అయితే, ఆదివారం సంఘటన జరిగిన సమయంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా ఇద్దరూ వాషింగ్టన్‌లోని అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఉండడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు దుండగుడు ఏ ఉద్దేశ్యంతో చొరబడ్డాడు? అతని వెనక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎస్టేట్ వద్ద ఘటన జరగడంతో ఎఫ్‌బీఐ సైతం రంగంలోకి దిగింది.


