కలం, వెబ్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup)-2026 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు అర్జెంటీనా ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనుంది. సాధారణ లైట్ బ్లూ-వైట్ జెర్సీకి బదులుగా నేవీ బ్లూ ఆల్టర్నేట్ జెర్సీ ధరించేందుకు అర్జెంటీనా యాజమాన్యం ఫిఫా అనుమతి కోరగా, అందుకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయం కేవలం జెర్సీల రంగులు వేర్వేరుగా కనిపించేందుకు మాత్రమే కాదని తెలుస్తోంది. 1986 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లో డియాగో మారడోనా “హ్యాండ్ ఆఫ్ గాడ్”, “గోల్ ఆఫ్ ది సెంచరీ” గోల్స్‌తో అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన మ్యాచ్‌లో కూడా ఇదే రంగు జెర్సీని జట్టు ధరించింది.
ఆ చారిత్రక జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మానసిక ఆధిక్యం సాధించాలని అర్జెంటీనా భావిస్తోంది. 1986 తర్వాత ప్రపంచకప్‌లో ఇరు జట్లు మరో రెండుసార్లు తలపడ్డాయి. 1998లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించగా, ఆ మ్యాచ్‌లో కూడా నేవీ బ్లూ జెర్సీనే ధరించింది. 2002లో సంప్రదాయ జెర్సీతో బరిలోకి దిగిన అర్జెంటీనా ఇంగ్లండ్ చేతిలో 1-0తో ఓడిపోయింది. ఈ సెమీఫైనల్లో ఇంగ్లండ్ తన సంప్రదాయ తెలుపు జెర్సీలో ఆడనుండగా, అర్జెంటీనా నేవీ బ్లూ-బ్లాక్ ఆల్టర్నేట్ జెర్సీలో బరిలోకి దిగుతుందని ఫిఫా ధృవీకరించింది.
ఈ ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ప్రధాన జెర్సీ ధరించి విజయాలు సాధించింది. ఆల్టర్నేట్ జెర్సీతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో కూడా జట్టు 3-1తో విజయం సాధించింది. ఇప్పుడు అదే జెర్సీతో సెమీఫైనల్లో ఎలా రాణిస్తుందో ఆసక్తిగా మారింది.

