కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్‌కు(AR Rahman) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పొన్నియిన్ సెల్వన్–2 సినిమాలోని ‘వీరా రాజ వీర’ పాటకు దాగర్ కుటుంబానికి క్రెడిట్స్ ఇవ్వాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. అంతేకాదు, రూ.2కోట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆ పాటకు డాగర్ కుటుంబానికి క్రెడిట్స్ ఇస్తామని, వాళ్ల పేర్లను చేరుస్తామని, నగదు డిపాజిట్ చేస్తామని రహమాన్ తెలిపారు.
వివాదమేంటి?
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్–2 సినిమాలో వీరా రాజ వీర’ పాట ఉంది. అయితే, ఈ పాటకు సంగీతాన్ని తన తండ్రి నాసిర్ ఫయాజుద్దీన్ దాగర్, ఆయన సోదరుడు జహీరుద్దీన్ దాగర్ స్వరపరిచిన ‘శివ స్తుతి’ నుంచి తీసుకున్నారంటూ ప్రఖ్యాత క్లాసికల్ సింగర్ ఫయాజ్ వసీఫుద్దీన్ దాగర్ ఢిల్లీ కోర్టులో కేసు వేశారు. వాళ్లిద్దరూ మరణించిన తర్వాత ఈ పాటపై కాపీరైట్ తనకు దక్కిందన్నారు. అయితే, దీనిని పొన్నియిన్ సెల్వన్ సినిమాలో వాడుకున్నారని, దీనికి గాను చిత్ర నిర్మాణ సంస్థలు మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ క్రెడిట్స్ ఇవ్వడంతోపాటు పరిహారం చెల్లించాలని అందులో కోరారు.
దీనిని ఏఆర్ రహమాన్(AR Rahman) అంగీకరించలేదు. ‘శివ స్తుతి’ పబ్లిక్ డొమైన్లో ఉందని, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు. అంతేకాదు, తాను రాగాన్ని కాపీ చేయలేదని, 228 వాయిద్యాలతో సరికొత్తగా సృష్టించానని చెప్పారు. రహమాన్ వాదనను తిరస్కరించిన ఢిల్లీ కోర్టు ఆ పాటకు డాగర్ కుటుంబానికి క్రెడిట్స్ ఇవ్వాలని, రూ.2కోట్లు పరిహారంగా రిజిస్ట్రార్ వద్ద కట్టాలని, అలాగే దావా ఖర్చులకు రూ.2లక్షలు పిటిషన్‌దారుడికి చెల్లించాలని తీర్పు చెప్పింది.
దీనిపై రహమాన్ ఢిల్లీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. దీంతో ఫయాజ్ వసీఫుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు శుక్రవారం తుదితీర్పు వెల్లడించింది.


