కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంట గ్యాస్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న వేళ ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (మార్చి 23) నుంచి రేషన్ కార్డుదారులకు (Ration Card Holders) కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఏపీకి కేంద్రం 2800 లీటర్ల కిరోసిన్ కేటాయించింది. దీంతో రేపటి నుంచి ఒక్కో రేషన్ కార్డుకు లీటర్ చొప్పున కిరోసిన్ (Kerosene) పంపిణీని కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. కిరోసిన్ పంపిణీ ప్రక్రియను తొలుత మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాలలో చేపట్టనున్నారు.
గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మార్చి 21న విశాఖపట్నం పోర్టుకు రావాల్సిన నౌక మార్చి 26న రానుంది. దీంతో ఎల్పీజీ గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2800 లీటర్ల కిరోసిన్ (Kerosene) కేటాయించింది.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్యాస్ నిల్వల గురించి వచ్చే వదంతులు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
పాఠశాలు, ఆస్పత్రులు, హాస్టళ్లకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని చెప్పారు. వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లకు వెళ్లకుండా అరికట్టేందుకు సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్యాస్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అతి త్వరలోనే ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు వంట గ్యాస్ సిలిండర్లను ఎవరైనా అక్రమంగా నిల్వ చేసినా..అక్రమ రవాణా ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించేందుకు యత్నించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు.
Read Also: అసెంబ్లీలోకి మరో సంచలన బిల్.. రేపు క్యాబినెట్‌లో చర్చ
Follow Us On: Youtube

