బడ్జెట్‌లో బీసీలకు ప్రభుత్వం అన్యాయం : బీసీ జేఏసీ నేతలు

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ సారి కూడా బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని బీసీ జేఏసీ (BC JAC) నేతలు మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర బడ్జెట్- బీసీల (BC JAC) వాటా అంశంపై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు జీ ఆనంద్ గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.

జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత రెండు బడ్జెట్ల మాదిరిగానే మూడో బడ్జెట్ లోనూ బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. బీసీల సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని, బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని, బీసీ స్టూడెంట్ల ఫీజు రియంబర్స్ మెంట్ కోసం రూ.10వేల కోట్లు కేటాయించాలని తాము డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. బీసీలకు బడ్జెట్ లోకేటాయింపులు తగ్గించి.. అప్పుల్లో రెండులక్షల కోట్లు కేటాయించడం సిగ్గు చేటన్నారు. బీసీ స్టూడెంట్లకు రూ.7500 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడం దారుణం అని విమర్శలు గుప్పించారు.

ఎల్ రమణ మాట్లాడుతూ బీసీలకు రూ.12,500 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. 60 శాతం ఉన్న జనాభాకు రేవంత్ ప్రభుత్వం 3.8% నిధులు కేటాయించడం ఏంటి ప్రశ్నించారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఎవరి వాటాలు వారికి దక్కాలన్న రాహుల్ గాంధీ సూత్రం తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదన్నారు. అధికార పార్టీలో ఉన్నా.. బీసీలకు జరుగుతున్న అన్యాయన్ని చూసి గళం విప్పుతున్నట్టు చెప్పారు. బీసీలకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ ను కలిసి కోరుతానని తెలిపారు. బీసీ బిడ్డగా ఈ ఉద్యమానికి మద్దతు తెలపడానికే వచ్చినట్టు హనుమంతరావు వెల్లడించారు.

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలు అంటే ప్రభుత్వానికి చిన్నచూపు అని.. తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బీసీలకు సరైన కేటాయింపులు జరగట్లేదని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ లేకపోవడంతో బీసీలకు అన్యాయం చేస్తున్నా ఎవరూ మాట్లాడట్లేదని.. బీసీ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే బీజేపీ పార్టీ పాల్గొంటుందని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ డెమొక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లేపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>