కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల (AP Municipal Elections) వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో, అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం అత్యంత కీలక దశకు చేరింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో జనసేన నేతలు కలుసుకున్నారు. ఈ సమావేశానికి జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బొలిశెట్టి, ఎమ్మెల్సీ హరిప్రసాద్తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయాల్సిన స్థానాలు, కేటాయింపులపై ఇరు పార్టీల మధ్య తీవ్ర కసరత్తు జరుగుతోంది.
తాజా ఎన్నికల సమీకరణాల నేపథ్యంలో మున్సిపల్ స్థానాల్లో మెరుగైన వాటా కోరుతున్న జనసేన, క్షేత్రస్థాయి బలాబలాల ఆధారంగా సీట్లు కేటాయించాలని పట్టుబడుతోంది. విజయవాడతో పాటు అదనంగా 5 కార్పొరేషన్లను జనసేన కోరుతోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో అన్ని పార్టీల సమతూకం దెబ్బతినకుండా, కూటమి ఐక్యతకు భంగం కలగకుండా టీడీపీ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సంకేతాలు వెలువడటంతో, నామినేషన్ల ప్రక్రియకు సమయం దగ్గరపడుతోంది. దీంతో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల అధినేతలు త్వరలోనే ఒక స్పష్టమైన ఒప్పందానికి వచ్చి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

