కలం, వెబ్ డెస్క్: తమిళ హీరో సూర్య (Suriya) సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు సామాజిక సేవలోనూ భాగమవుతున్నారు. తన రెమ్యూనరేషన్లో కొంత మొత్తాన్ని పేద విద్యార్థుల చదువుకు ఖర్చు చేస్తూ, పలువురికి అండగా నిలుస్తున్నారు. అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన, తాజాగా మరో 25 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాడు. తరచూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సూర్యపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు సూర్య కీలక సూచనలు చేశారు. సినిమాల్లో తప్పు చేస్తే రీటేక్ తీసుకునే అవకాశం ఉంటుందని, కానీ నిజ జీవితంలో అలాంటి అవకాశం ఉండదని అన్నారు. రీల్స్తో సమయం వృథా చేయకుండా కష్టపడి చదువుకుంటేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని సూచించారు. చదువులో వెనుకబడినప్పుడు నిరాశ చెందకుండా, తమను తాము ప్రోత్సహించుకోవాలన్నారు. ‘వన్స్ మోర్’ అంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యతోనే జీవితంలో మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని హీరో సూర్య విద్యార్థులకు మెసేజ్ ఇచ్చారు.

