కలం, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం వార్షిక సముద్ర వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు ‘మత్స్యకారుల సేవలో’ (Matsyakarula Sevalo Scheme) పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈ స్కీమ్ ద్వారా ఏపీ వ్యాప్తంగా దాదాపు 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని రిలీజ్ చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సుమారు 5,910 మంది అర్హులైన మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో ఆ డబ్బులు జమ కాలేదు. దీంతో తాజాగా వారందరికీ ఆ డబ్బులను రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న అర్హులందరికీ కూడా రూ. 20,000 చొప్పున మొత్తం రూ.11.82 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే అర్హత ఉండి కూడా ఈ పథకం కింద నిధులు జమకాని వారు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తెలిపింది. సదరు వ్యక్తులు వెంటనే తమ పరిధిలోని స్వర్ణ గ్రామం, లేకుంటే స్వర్ణ వార్డు సచివాయాలను సంప్రదించాలని సూచించింది.

