12 ఏండ్లపాటూ ఏపీలో వింత పరిస్థితి

క‌లం, వెబ్ డెస్క్‌ : దేశంలోని ఏ రాష్ట్రానికి లేని వింత పరిస్థితి ఏపీలో నెలకొన్నది. దాదాపులగా 12 ఏండ్లపాటూ ఏపీకి చట్టబద్ధమైన ఒక రాజధాని లేదు. కారణాలు ఏవైనప్పటికీ ఏపీ రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్నేండ్లకు అమ‌రావ‌తి (Amaravati) ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 28న అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశంలో తీర్మానం చేసి ప్ర‌భుత్వం కేంద్రానికి పంపించ‌నుంది. ఈ పార్ల‌మెంట్ సెష‌న్‌లోనే కేంద్రం దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోనుంది. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తే రాజ‌కీయంగా రాజ‌ధానికి ఎలాంటి ఇబ్బందులు లేక‌పోవ‌డ‌మే కాకుండా, అభివృద్ధికి కేంద్రం నుంచి స‌హ‌కారం అందుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ రాజ‌ధాని (AP Capital) అంశం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాజధాని లేకుండానే పాలన

2014 నుంచి 2026 వ‌ర‌కు దాదాపు 12 ఏళ్ల పాటు రాజ‌ధాని లేకుండా దేశంలో ప‌రిపాల‌న సాగించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 2014లో కొత్త రాష్ట్రంగా అవ‌త‌రించిన త‌ర్వాత ఏపీకి అస‌లు రాజ‌ధాని లేకుండానే ప‌రిపాల‌న సాగింద‌ని చెప్పాలి. ఒక రాష్ట్రానికి రాజ‌ధాని లేక‌పోతే ఎంత‌టి న‌ష్టం జ‌రుగుతుందో చెప్ప‌డానికి ఏపీ ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. గ‌తంలో చూసుకుంటే భారతదేశంలో కొత్త రాష్ట్రాల‌ను ప్ర‌క‌టించిన సందర్భాల్లో ఒక స్పష్టమైన రాజధాని ఏర్పాటు చేశారు. కానీ ఏపీ విషయంలో మాత్రం పదేళ్లకు పైగా క్లారిటీ లేకపోవడం గ‌మ‌నార్హం. ఇది పరిపాలనతో పాటు రాష్ట్ర‌ అభివృద్ధిపై తీవ్ర‌ ప్రభావం చూపింది. సోష‌ల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర చ‌ర్చ సాగింది. రాజ‌ధాని లేని రాష్ట్ర‌మంటూ నెటిజ‌న్లు ట్రోల్స్ చేశారు. నాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు (Chandrababu) అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించినా దాని చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో అమ‌రావ‌తికి పెట్టుబ‌డులు రాక‌, కేంద్రం నుంచి ఆర్థిక స‌హ‌కారం లేక అభివృద్ది కుంటుప‌డింది.

పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోని రాజధాని

గ‌త ప‌దేళ్లకు పైగా ఏపీలో రాజ‌ధాని విష‌యంలో జ‌రిగిన రాజ‌కీయం అంతా ఇంతా కాదు. 2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన జ‌రిగింది. కేంద్రం తెలంగాణ‌, ఏపీల‌కు హైదరాబాద్‌ను ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ఏపీకి పరిపాలన కోసం కొత్త రాజ‌ధాని అవసరమైంది. అదే సమయంలో రాజధాని ఎంపిక అంశం రాజకీయంగా, సామాజికంగా కీలక చర్చగా మారింది. 2015లో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని (Amaravati) రాజధానిగా ప్రకటించారు. అమ‌రావ‌తిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని భారీ ప్రణాళికలు రూపొందించారు. సింగపూర్ మోడల్, ఐకానిక్ బిల్డింగ్స్, గ్రీన్‌ఫీల్డ్ సిటీ అంటూ గొప్ప విజన్‌ను ప్రజల ముందుంచారు. రైతుల నుంచి భూములు సేకరించి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే మొదటి ఐదేళ్లలో పరిపాలనాత్మక భవనాలు కొంతవరకు నిర్మాణ దశలోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయి రాజధాని రూపుదిద్దుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు, కేంద్ర సహకారం లోపం, ప్రాధాన్యతల మార్పు వంటి కారణాలు అమ‌రావ‌తి నిర్మాణానికి ఇబ్బందులు సృష్టించాయి.

జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల నినాదం..

2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి మోడల్‌ను పూర్తిగా తిరస్కరించారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించ‌డం వెనుక పెద్ద కుట్ర కోణం ఉంద‌ని, ఇదొక భారీ భూదోపిడీకి ప‌న్నాగం అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వం వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖపట్నం, శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తి, న్యాయ రాజ‌ధానిగా కర్నూలు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. రాజ‌ధాని విష‌యంలో నాటి సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా కుదిపేసింది. అమరావతి రైతులు భారీ ఆందోళనకు దిగారు. ఒకే రాజధాని అవసరమా? లేక వికేంద్రీకరణ మంచిదా? అనే చర్చలు చెలరేగాయి. చట్టపరమైన పోరాటాలు, కోర్టు కేసులు, రాజకీయ ఆరోపణలు ఇలా రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో ప్ర‌ధాన‌ అంశంగా మారింది.

మ‌రోవైపు రాజ‌ధాని నిర్మాణంలో మునిగిపోయిన ఏపీ ప్ర‌భుత్వాలు ప‌దేళ్ల‌లో ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్‌ను ఏమాత్రం వినియోగించుకోలేక‌పోయారు. వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అమ‌రావ‌తి అభివృద్ధిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. అంత‌కు ముందు టీడీపీ హ‌యాంలో మొద‌లైన ప్రాజెక్టుల‌న్నీ నిలిచిపోయాయి. సాంకేతికంగా చూస్తే అమరావతి శాసన రాజధానిగా కొనసాగినప్పటికీ పూర్తి స్థాయి పరిపాలనా కేంద్రం లేకపోవడం వల్ల ఏపీకి స్థిరమైన రాజధాని లేద‌నే వాదన బలపడింది. ప్రభుత్వ కార్యాలయాలు వివిధ ప్రాంతాల్లో ఉండటం, నిర్ణయాత్మక స్పష్టత లేకపోవడం.. పెట్టుబడిదారుల్లో అనిశ్చితి కలిగించింది. ఇప్పటికైనా అమరావతి (Amaravati) రాజధానికి చట్టబద్ధత కల్పించింది.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: గ్యాస్ బుకింగ్ గడువుపై కేంద్రం కీలక ప్రకటన

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>