ఏపీ రైతులకు, గంగాపుత్రులకు గుడ్‌న్యూస్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఖరీఫ్ సాగునీటి విడుదలకు షెడ్యూల్ రిలీజ్ అయినట్లు మంత్రులు నిమ్మ‌ల రామానాయుడు, కింజ‌రాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అమరావతి సచివాలయంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖలపై ఉన్నతాధికారులతో మంత్రులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, నిమ్మ‌ల రామానాయుడు (Nimmala Ramanaidu) సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్-2026 (Kharif Schedule) సాగునీటి విడుదలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. జూన్-1 నుంచి కాలువలకు నీటి విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాలువల మరమ్మతులను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఖ‌రీఫ్-2026ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించాలన్నారు.

ఎరువులు పక్కదారి పడితే చర్యలు..

పంట ఎదుగుదలకు వాడే ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) హెచ్చ‌రించారు. యూరియా స‌ర‌ఫ‌రాపై రైతుల‌కు ప్ర‌త్యేక‌ కార్డుల‌ను అంద‌చేస్తామని ప్రకటించారు. అవ‌స‌రం మేర‌కు ఆ కార్డు ద్వారా యూరియాను తీసుకోవ‌చ్చని చెప్పారు. రైతులు యూరియాను ముంద‌స్తుగా నిల్వ చేసుకోవద్దని సూచించారు. రెండు, మూడు ద‌ళ‌ల‌లో నానో యూరియా వినియోగించాలని సూచించారు. యుద్ధం కార‌ణంగా యూరియా దిగుమ‌తికి ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉందని చెప్పారు.ఈ తరుణంలో యూరియాను రైతులు అవ‌స‌రం మేర‌కు వాడాలని సూచించారు.

ఉద్యాన రైతుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..

రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉద్యాన రైతుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్వీట్ ఆరెంజ్ తోటల్లో నీటి ఒత్తిడి పరిస్థితులపై ఇప్పటికే రెండు నెలల క్రితమే అనంతపురం జిల్లాలో అధికారుల‌ను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌లు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.

గంగాపుత్రులకు మంత్రులు గుడ్ న్యూస్..

అటు రాష్ట్రంలోని గంగాపుత్రులకు మంత్రులు గుడ్ న్యూస్ చెప్పారు. గంగపుత్రులకు రెండో ఏడాది ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సేవలో’ కింద ప్రతీ కుటుంబానికి రూ.20 వేలు జమ చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు లబ్ది చేకూరుతుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అథితిగా హాజరై నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>