కలం, వెబ్ డెస్క్ : గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. పంచాయతీరాజ్ రంగంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం గౌరవం ప్రకటించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో రెండో స్థానం లభించింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది గర్వకారణమైన గుర్తింపని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలు ఈ అవార్డులలో ప్రతిభ చూపించాయి. సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు కలిసి సాధించిన ఈ విజయం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

