కలం, వెబ్ డెస్క్ : వియత్నాం పడవ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై సీఎం ఆరా తీశారు. బాధితులంతా సురక్షితంగా స్వదేశానికి చేరుకునే వరకు , అలాగే మృతుల భౌతిక కాయాల తరలింపు పూర్తయ్యే వరకు అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో వియత్నాంలో భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన గెల్లి కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కాగా, ఒక ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ తమ దేశీయ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విహారయాత్రలో ఈ విషాదం చోటు చేసుకుంది. పడవ ప్రమాదంలో మొత్తం 32 మంది ప్రయాణిస్తుండగా… వారిలో 15 మంది జల సమాధి అయ్యారు. మృతులలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావడం గమనార్హం. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గెల్లి కిషోర్ భార్య గెల్లి జయశ్రీ (50) మరణించారు.

