కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ (AP Cabinet) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. హైకోర్టు భవనాల సమీపంలో రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
రాజధాని పరిధిలో పరిపాలనను మరింత వేగవంతం చేసేందుకు ఏపీ సీఆర్డీఏ (APCRDA) బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు, అమరావతి ఎకనామిక్ రీజియన్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితో పాటు భద్రతా పరమైన చర్యల్లో భాగంగా సీఆర్డీఏ పరిధిలో ప్రత్యేక అగ్నిమాపక విభాగం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రోత్సాహకాలపై చర్చించనున్నారు.
మౌలిక వసతుల విస్తరణలో భాగంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌తో పాటు, రాజధాని ప్రాంతంలో అత్యాధునిక డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. అలాగే గ్రామకంఠంలో 5 సెంట్ల వరకు భూమి కేటాయింపు అంశంపై, పేదల ఇళ్ల స్థలాల కేటాయింపులపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు ప్రముఖ సంస్థలకు భూకేటాయింపులు చేసే అంశంపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

