కలం, వెబ్ డెస్క్: ఫ్రెంచ్ ఓపెన్ (French Open)లో మరో సంచలనం నమోదైంది. ప్రపంచ 114వ ర్యాంకర్ మాజా చ్వాలిన్స్‌కా (Majaa Chwalinska) తన అద్భుత ప్రయాణాన్ని కొనసాగిస్తూ తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 22వ సీడ్ అన్నా కాలిన్స్కయాపై మాజా 7-6(3), 6-3 తేడాతో విజయం సాధించారు. ప్రతిష్టాత్మక కోర్ట్ ఫిలిప్-చాట్రియర్‌లో జరిగిన ఈ పోరులో కీలక సమయాల్లో మెరుగైన ఆటతో ఆమె పైచేయి సాధించారు. మ్యాచ్ ఆరంభంలో తొలి గేమ్ కోల్పోయిన మాజా వెంటనే పుంజుకున్నారు. వరుస బ్రేక్‌లతో 5-1 ఆధిక్యంలోకి వెళ్లారు.
అయితే కాలిన్స్కయా వరుసగా నాలుగు గేమ్స్ గెలిచి పోరును సమం చేశారు. దీంతో తొలి సెట్ టైబ్రేక్‌కు వెళ్లగా, అక్కడ మాజా ఆధిపత్యం చెలాయించి సెట్‌ను సొంతం చేసుకున్నారు. మొదటి సెట్ తర్వాత మాజా మరింత దూకుడుగా ఆడారు. రెండో సెట్‌లో ప్రత్యర్థికి పెద్దగా అవకాశం ఇవ్వకుండా 6-3తో ముగించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మాజా రిటర్న్ గేమ్‌లో అద్భుతంగా రాణించారు. ఆమెకు వచ్చిన ఎనిమిది బ్రేక్ పాయింట్లలో ఏడు అవకాశాలను విజయవంతంగా ఉపయోగించుకున్నారు. మరోవైపు కాలిన్స్కయా 11 అవకాశాల్లో ఐదు మాత్రమే మార్చుకోగలిగారు. కాలిన్స్కయా రెండు ఏసులు నమోదు చేసినా, ఆరు డబుల్ ఫాల్ట్‌లు ఆమెకు ప్రతికూలంగా మారాయి.
మొత్తం మ్యాచ్‌లో మాజా 82 పాయింట్లు గెలుచుకోగా, కాలిన్స్కయా 69 పాయింట్లతో నిలిచారు. రిసీవింగ్‌లో కూడా మాజా 43 పాయింట్లు సాధించి ఆధిక్యం చూపించారు. 24 ఏళ్ల మాజాకు ఇది రోలాండ్ గారోస్‌లో ఈ ఏడాది ఎనిమిదో విజయం. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన ఆమె ఇప్పటికే అరుదైన ఘనత సాధించారు. ఓపెన్ ఎరాలో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌కు చేరిన రెండో క్వాలిఫయర్‌గా చరిత్రలో నిలిచారు. అంతకుముందు 2020లో నాడియా పొడోరోస్కా ఈ ఘనత సాధించారు. ఫైనల్ బెర్త్ కోసం గురువారం జరిగే సెమీఫైనల్‌లో ప్రపంచ నంబర్-1 అరినా సబలెంకా, డయానా ష్నైడర్ మధ్య క్వార్టర్ ఫైనల్ విజేతతో మాజా తలపడనున్నారు. మరో విజయం సాధిస్తే, ఓపెన్ ఎరాలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన తొలి క్వాలిఫయర్‌గా కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఆమె ముందున్నారు.

