కలం, వెబ్ డెస్క్: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) ఈ మధ్య తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఇప్పసారాపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇదే అంశంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. సొంత ప్రభుత్వంపై కూడా అప్పుడప్పుడు విమర్శలు చేస్తుంటారు అనిరుధ్ రెడ్డి. డ్రగ్స్ వ్యవహారంపై కూడా అనిరుధ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని.. ప్రతి హీరో తన సినిమా విడుదలకు ముందు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని.. నెగిటివ్ అని తేలితేనే సదరు హీరో సినిమాలకు అనుమతి ఇచ్చేలా నిబంధనలు తీసుకురావాలంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. అనిరుధ్ వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి.
మనసులో మాట బయటపెట్టిన అనిరుధ్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మనసులోని మాటను బయటపెట్టారు. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉందని.. తాను కూడా సీఎం రేసులో ఉంటానని అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) వ్యాఖ్యానించారు. మరో పదేండ్లు తానే ముఖ్యమంత్రిననని రేవంత్ రెడ్డి అంటున్నారని.. ఆ తర్వాత తాను రేసులో ఉంటానని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. జడ్చర్ల ప్రజలు తనను వరసగా గెలిపిస్తే కచ్చితంగా రేసులో ఉంటానంటూ ధీమా వ్యక్తం చేశారు. అనిరుధ్ వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
Read Also: ఇంటర్‌నెట్ షట్ డౌన్ !
Follow Us On: X(Twitter)

