ఆర్ఎస్ఎస్ కార్య‌క‌లాపాల‌కు నిర‌స‌న‌గా నేడు ఏయూ బంద్‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఆంధ్రా విశ్వవిద్యాలయం (Andhra University) క్యాంపస్‌లో ఆర్ఎస్ఎస్ (RSS) కార్యకలాపాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొన్ని రోజులుగా క్యాంపస్‌లో కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు బుధవారం గ్రౌండ్‌లో నిర్వహించిన మార్చ్‌పై ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. మార్చ్ నిర్వహించడానికి యూనివర్సిటీ అనుమతి ఉందా అని విద్యార్థులు ప్రశ్నించడంతో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారితో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం ఘర్షణకు దారితీసి కొంతసేపు క్యాంపస్ రణరంగంగా మారింది. తమపై దాడి జరిగిందని ఏయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మూడ‌వ‌ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టాలని, క్యాంపస్‌లో ఇత‌ర‌ సంస్థల కార్యకలాపాలను అనుమతించవద్దని వారు కోరుతున్నారు. ఘర్షణ అనంతరం ఏయూ విద్యార్థి సంఘాలు అత్యవసర సమావేశం నిర్వహించాయి. ఉమ్మడి పోరాట కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు నిరసనగా నేడు ఏయూ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అన్ని హాస్టళ్లకు వెళ్లి బంద్‌కు సహకరించాలని విద్యార్థి నాయకులు విజ్ఞప్తి చేశారు. బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. క్యాంపస్‌లో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసు బలగాలను మోహరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>