కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సంగమ ప్రాంతం అది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం. స్వాతంత్య ఉద్యమ స్ఫూర్తితో పోరాటంలో భాగస్వాములయ్యారు అక్కడి ప్రజలు. స్వాతంత్రం సిద్ధించాక అదే స్ఫూర్తిని కొనసాగించాలని పోరాట పటిమ, దేశభక్తిని భావి తరాలకు అందించాలని బిచ్కుందకు చెందిన ముగ్గురు స్నేహితులు సంకల్పించారు. భరతమాత(Bharat Mata Temple ) కు గుడి కట్టాలని నిర్ణయించారు. అనుకున్నట్టే 1950లో ఓ గుడిసెలో భరతమాత మట్టి విగ్రహంతో ఆలయం నిర్మించారు.
ఇలాంటి భరత మాత ప్రాచీన ఆలయాలు దేశంలో రెండే ఉండగా.. ఒకటి కాశీలో.. మరొకటి బిచ్కుందలో ఉండడం విశేషం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అయిన సందర్భంగా భరతమాత గుడి (Bharat Mata Temple)పై ‘కలం’ ప్రత్యేక కథనం అందిస్తోంది.
నిత్యం దూప దీప నైవేధ్యాలు
వివరాల్లోకి వెళ్తే.. బిచ్కుందకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పిశికే లక్ష్మయ్య 1950లో ఒక గుడిసెలో భరతమాత విగ్రహం ఏర్పాటు చేశారు. దాతలు భూమి ఇవ్వగా ఆయన తన ఇద్దరు స్నేహితులు నక్క రామన్న, అల్లే గంగారాం సహకారంతో ఆలయం నిర్మించారు. పద్మశాలి సంఘం నేతలు ముందుకు వచ్చి పెండింగ్ పనులు పూర్తి చేశారు. అప్పటి నుంచి భరతమాతకు దూప దీప నైవేద్యాలతో నిత్యం పూజలు చేస్తుండగా.. ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకం జరుగుతోంది. ఇక్కడ ప్రతి శనివారం నిర్వహించే భజన సైతం ఆకట్టుకుంటుంది. రచ్చ శివకాంత్, గంగుల శ్రీనివాస్, రాజు, బాలరాజ్, పరమేశ్వర్ ఐదుగురూ కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. గ్రామస్తులందరూ సమష్టిగా ఆలయ అభివృద్ధి, దేశభక్తి పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దుర్గామాతగా గుర్తించి మొక్కులు
1982లో ఆలయానికి పూజారిని నియమించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడులను ఘనంగా నిర్వహించి జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. మూడేళ్ల కింద అమ్మవారికి పంచలోహ విగ్రహం తయారు చేయించారు. తమిళనాడులోని కుంభకోణంలో ప్రత్యేకంగా తయారు చేయించి తెచ్చి, ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
రూ. 40 లక్షల నిధులతో కొత్త ఆలయం నిర్మించారు. గ్రామానికి చెంది పెద్దలు, పిల్లలు అందరూ తోచినంత సాయం చేశారు. ఆలయానికి జై కొట్టారు. ఇప్పుడు భరత మాత దేవతగా మారింది. భక్తుల్లో నమ్మకం పెరిగింది. సంతానం, ఉద్యోగాలు, రాజకీయాలు ఇలా కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మొక్కిన ప్రతి పని అవుతుండడంతో దుర్గామాతగా నమ్ముకున్నామని అంటున్నారు. ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు.
ముగ్గురు కట్టారు.. ఐదుగురు బాధ్యత తీసుకున్నారు
పిశికే లక్ష్మయ్య, రామన్న, అల్లే గంగారాం ముగ్గురు ఈ అద్భుత ఆలయాన్ని నిర్మించారు. అయితే రచ్చ శివకాంత్, గంగుల శ్రీనివాస్, రాజు, బాలరాజ్, పరమేశ్వర్ ఆలయ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఆలయ నిర్మాణం పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల నిర్వహణ లాంటి బాధ్యతలు భుజాన వేసుకొని దేశభక్తిని మరింత రగిలిస్తున్నారు. దీంతో బిచ్కుందలోని పెద్దల సంకల్పం నెరవేరుతుంది. గ్రామస్తులు సైతం అందరూ సమిష్టిగా ఆలయ అభివృద్ధి దేశభక్తి పెంపొందేందుకు కృషి చేస్తున్నారు.
బిచ్కుందలో జన్మించడం అదృష్టం : రాజు, బిచ్కుంద
భారత మాత కరుణ కటాక్షాలు మాపై ఉంటాయి. బిచ్కుందలో పుట్టడం గుడి నిర్మాణంలో పాలు పంచుకోవడం మా అదృష్టం. అందరికీ అడిగినవన్నీ ఇస్తోంది భారత మాత. చదువు సంతానం ఉద్యోగాలు రాజకీయ పదవులు అన్నీ కోరుకుంటే జరుగుతున్నాయి.
భారత మాతను దుర్గామాత గా కొలుస్తాం – శివకాంత్, బిచ్కుంద
బిచ్కుంద లోని భారత్ మాత మూడు రాష్రాల భక్తులకు జనాలు పిల్లలకు దుర్గా దేవి మాతగా మారింది. అందుకే దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఆషాఢంలో బోనాలు నిర్వహిస్తున్నాం. చాలా శక్తివంతమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మూడేళ్ల కిందట 350 కిలోల బరువుతో మూడున్నర అడుగుల ఎత్తు
పంచ ధాతు విగ్రహంతో అమ్మవారిని తయారు చేయించి ప్రతిష్టించాం. ఈ మందిరం నిర్మాణంలో నేను పాలు పంచుకోవడం సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాను. భారత మాత జయంతి మార్గశిర షష్టి రోజున అన్నదానం అభిషేకం జరుపుతాం. రాజకీయ నాయకులు కూడా వచ్చి ఈ సెంటిమెంట్ గా ప్రచారం చేస్తూ పూజలు చేస్తున్నారు.. భావి తరాలకు దైవభక్తి దేశ భక్తి రెండూ అందిస్తాం.
Also Read : భారతీయుల చూపు.. సింహళం వైపు: ఫారిన్ టూరిజంలో టాప్ ప్లేస్
Follow Us On: X(Twitter)




