కలం, నేషనల్ డెస్క్: ‘ఆపరేషన్ కగార్’పై లోక్‌సభలో సోమవారం జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా, రాహుల్‌గాంధీపైనా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్ల భావజాలంతో మొదటి నుంచీ కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నదని, ఇప్పటికీ అదే వైఖరి కనిపిస్తున్నదన్నారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే మావోయిస్టు పార్టీ బలపడిందన్నారు. దాదాపు పదిహేనేళ్ల నుంచీ రాహుల్‌గాంధీ మావోయిస్టు ఐడియాలజీ కలిగినవారితో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఒడిశాలో 2010లోనే ఒక బహిరంగసభ వేదికపై మావోయిస్టు అనుబంధ సంఘాల నేతలతో కలిసి పాలుపంచుకున్నారని, ఆ నేతలు రాహుల్‌గాంధీని సన్మానించారని అమిత్ షా గుర్తుచేశారు. ఆ తర్వాత 2018లో హైదరాబాద్‌లో గద్దర్‌తో సమావేశమయ్యారన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగానూ నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తులతో మీటింగ్ పెట్టుకున్నారని ఆరోపించారు. తాజాగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే కోఆర్డినేషన్ కమిటీకి చెందినవారితోనూ సమావేశమయ్యారని గుర్తుచేశారు.
అధికారం కోసం ఆదివాసీలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ :
కాంగ్రెస్ పార్టీకి ఉన్న వామపక్ష భావజాలం కారణంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమం వేళ్లూనుకున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అధికారం కోసం ఆదివాసీ ప్రజలను కాంగ్రెస్ రెచ్చగొట్టడమే కాక వాడుకున్నదన్నారు. ఆ పార్టీకి ఉన్న వామపక్ష భావజాలం కారణంగానే నక్సలిజం వ్యాప్తి చెందిందన్నారు. ఏడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నక్సలిజాన్ని కట్టడి చేసే చర్యలు మొదలయ్యాయన్నారు. ఆపరేషన్ కగార్‌తో అది దాదాపుగా అంతమైపోయిందన్నారు. నక్సలిజం భావజాలం కారణంగానే దేశం సుదీర్ఘకాలంగా వెనుకబడి పోయిందన్నారు. బస్తర్ ప్రాంతాన్ని ఉదహరిస్తూ, 1970 నుంచీ నక్సలైట్ల సమస్య ఎందుకు పరిష్కారం కాలేదన్నారు. రెడ్ టెర్రర్ ప్రభావంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. బస్తర్ ప్రజలను ఎందుకు నిర్లక్ష్యం చేసిందీ ఇప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు బీజేపీ తీసుకున్న చర్యల వల్లనే బస్టర్ ప్రాంతంలో నక్సలిజం దాదాపుగా నిర్మూలన అయిందన్నారు.

