కలం, వనపర్తి: వనపర్తి పట్టణంలోని హిందూ స్మశానవాటికలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ మిడిదొడ్డి మాధవీలతకు ఆర్యవైశ్య సంఘం (Wanaparthy Arya Vaishya) పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బచ్చు రాము మాట్లాడుతూ.. వనపర్తి పట్టణం ఏర్పడి సుమారు 300 సంవత్సరాలు గడిచినా, పట్టణ జనాభాకు అనుగుణంగా సరైన హిందూ స్మశానవాటిక లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలి..
ప్రస్తుత స్మశానవాటికలో దహన సంస్కారాలకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దహన సంస్కారాలకు పనిచేసే వారు రూ.20 వేలకు పైగా డిమాండ్ చేస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత దహనవాటికలోని ఇనుప దిమ్మె ఎక్కువ ఎత్తులో, అధిక విస్తీర్ణంలో ఉండటంతో వినియోగానికి అనుకూలంగా లేక నిరుపయోగంగా మారుతోందన్నారు.
ఈ సమస్యలను గతంలోనే జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులతో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని తెలిపారు. విద్యుత్ దహన యంత్రం ఏర్పాటు చేయడంతో పాటు పట్టణ జనాభాకు అనుగుణంగా నూతన స్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న స్మశానవాటికలో ఖననం కోసం స్థలం తవ్వినప్పుడు గతంలో ఖననం చేసిన వారి పుర్రెలు బయటపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస మౌలిక వసతులు కల్పించాలి..
స్మశానవాటికలో నీటి వసతి, మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గది తదితర కనీస మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ పరిసరాల్లో భూముల ధరలు పెరగడంతో ప్రైవేట్ స్థలాల్లో ఖనన సంస్కారాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. అందువల్ల పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన స్మశానవాటిక ఏర్పాటు చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
అలాగే స్మశానవాటిక నిర్వహణ కోసం ఇద్దరు మున్సిపల్ కార్మికులను నియమించి, వారికి ప్రత్యేక పారితోషికం నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలిసెట్టి వెంకటేష్, కోశాధికారి ఏపూరి శ్రీనివాసులు, మాజీ అధ్యక్షుడు మారం బాలీశ్వరయ్య, లెగిశెట్టి అశోక్, దాచే శివ, యువజన సంఘం అధ్యక్షుడు బచ్చు వెంకటేశ్, వర్తక సంఘం అధ్యక్షుడు పాలాది సుమన్, చుక్కయ్య, మారం గోవిందు, కొండూరు ప్రవీణ్, భూపేష్, రఘు తదితర ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.

