కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతి చట్టబద్ధత బిల్లు (Amaravati Bill)పై నేడు పార్లమెంట్‌లో చర్చ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఈ సవరణ బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) చర్చను ప్రారంభించనున్నారు.
బీజేపీ నుంచి ఎంపీ పురందేశ్వరి బిల్లుపై మాట్లాడనున్నారు. జనసేన ఇద్దరు సభ్యుల్లో ఒకరికి బిల్లుపై (Amaravati Bill) మాట్లాడే అవకాశం లభించనుంది. దీనిపై సుమారు రెండు గంటలపాటు చర్చించిన తర్వాత లోక్ సభలో ఆమోదం పొందనుంది. అనంతరం గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. నేడు, రేపు ఉభయసభల్లో ఆమోదం పొందిన తర్వాత కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో ర్యాటిఫికేషన్ చేయనుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ ఈ బిల్లును రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దీని ద్వారా ఏపీ రాజధాని అమరావతి హోదాపై ఉన్న న్యాయపరమైన, సాంకేతిక పరమైన చిక్కులు తొలగిపోనున్నాయి. కేంద్రం నుంచి అందే నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏ ఆటంకం రాకుండా ఉంటుంది. ఒక రాష్ట్ర రాజధానికి ప్రత్యేకంగా పార్లమెంటు (Parliament) చట్టబద్ధత కల్పించే ఈ బిల్లు ఇటు ఆంధ్రప్రదేశ్, అటు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలువనుంది.
Read Also: యూఎస్‌లో 12 వేల మంది ఇండియన్స్‌కి బిగ్ షాక్!
Follow Us On : WhatsApp

