కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ (ట్రామా) సెంటర్ (Trauma Centre) భవనాన్ని వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆసుపత్రి సందర్శించారు. 2023–24 సంవత్సరంలో మంజూరైన ఈ ట్రామా సెంటర్ నిర్మాణ పనులు ఆరు నెలల క్రితమే పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు ప్రారంభించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడిగా మారారని, కమిషన్ల కోసమే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ట్రామా సెంటర్‌ను ప్రారంభించడంలో జాప్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. తక్షణమే ట్రామా సెంటర్‌ను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

