Mobile Popup Ad
Mobile Popup Ad

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్​​ : రన్నరప్​ లక్ష్యసేన్

కలం, వెబ్​ డెస్క్​: భారత్‌కు ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​ బాడ్మింటన్‌ టైటిల్​పై 25 ఏళ్ల కల మరోసారి చెదిరింది. ఈ ఛాంపియన్ షిప్‌ ఫైనల్లో లక్ష్యసేన్(Lakshya Sen) ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్ రన్నరప్‌గా నిలిచాడు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చైనీస్ తైపీకి చెందిన లిన్ చున్-యి చేతిలో లక్ష్య ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

నరాలు తెగే ఉత్కంఠ మధ్య 57 నిమిషాల పాటు సాగిన ఈ ఫైనల్లో లిన్ చున్-యి 21-15, 22-20తో లక్ష్య సేన్‌ను ఓడించాడు. తొలి గేమ్‌లో లిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా, రెండో గేమ్‌లో లక్ష్య సేన్ అద్భుతంగా పుంజుకుని ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే, కీలక సమయంలో లిన్ తన శక్తిని ప్రదర్శించి వరుస పాయింట్లతో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. కుడి కాలి వేళ్లకు బొబ్బలు ఉన్నప్పటికీ లక్ష్య చూపిన పట్టుదల అందరినీ ఆకట్టుకుంది. ఈ విజయంతో లిన్ చున్-యి ఈ టైటిల్ గెలిచిన తొలి చైనీస్ తైపీ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.

లక్ష్య(Lakshya Sen) పోరాటాన్ని అభినందిస్తూ పీవీ సింధు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. సుమారు గంటా 37 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ సెమీఫైనల్ తర్వాత 24 గంటల లోపే ఫైనల్ ఆడటం శారీరకంగా చాలా కష్టమని ఆమె పేర్కొంది. 2021లో తనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని గుర్తు చేసుకున్న సింధు, కఠినమైన మ్యాచ్‌ల ప్రభావం కాళ్లపై ఉంటుందని విశ్లేషించింది. ఓటమిని పట్టించుకోకుండా చిరునవ్వుతో ఉండాలని, ఇలాంటి అవకాశాలు మళ్ళీ వస్తాయని ఆమె లక్ష్యకు ధైర్యం చెప్పింది.

ఈ టోర్నీలో లక్ష్య సేన్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు షి యుకీ, లీ షిఫెంగ్‌లను ఓడించి ఫైనల్ చేరడం విశేషం. ఫైనల్ కు చేరే క్రమంలో ఆయన ఐదు గంటలకు పైగా కోర్టులో గడిపారు. ఆ అలసట ఫైనల్లో స్పష్టంగా కనిపించింది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో లక్ష్య సేన్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. గతంలో 2022లో కూడా ఆయన రన్నరప్‌గా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై లక్ష్య సేన్ కనబరిచిన ప్రతిభ భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తుపై ఆశలను రేకెత్తిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>