కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి మీద మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli) సంచలన ఆరోపణలు చేశారు. 200 సార్లు ఫోన్ చేసినా సీఎం రేవంత్ లిఫ్ట్ చేయట్లేదని.. అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ జాతి సమస్యలు చెప్పుకుందామని ప్రయత్నిస్తుంటే.. తనను దూరం పెడుతున్నారంటూ వాపోయారు మోత్కుపల్లి (Motkupalli). తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ ను కలవాలని చూస్తున్నా. ఆయన నాకు అవకాశం ఇవ్వట్లేదు. నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను. అయినా సరే నాకు కనీస మర్యాద ఇవ్వట్లేదు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కోరుదామని రెండున్నరేళ్ల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ రెస్పాన్స్ లేదు. నిన్న జరిగిన మాదిగల సన్మాన సభకు కూడా నన్ను పిలవలేదు. బహుషా సీఎం రేవంత్ నన్ను పిలవట్లేదు కాబట్టి వారు కూడా పిలవొద్దని అనుకున్నారేమో. తెలంగాణలో వందల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ మాకు మాత్రం ఒక్కటే ఇచ్చారు. సీఎం రేవంత్ ఐదెకరాలు ఇస్తే మాదిగ భవనం కట్టుకుందామని చూస్తున్నాం. కానీ ఇవ్వట్లేదు. ప్రతి చోటా మా వర్గానికి అన్యాయమే జరుగుతోంది’ అని మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి తమ వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నట్టే కనిపిస్తోందని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ‘మాదిగలు పార్లమెంట్ లో అడుగు పెట్టొద్దని ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పదవుల విషయంలోనూ ఇలాగే చేశారు. ఇప్పటికైనా మాదిగలు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది’ అని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.

