కలం, ఇల్లందు: ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే తగిన నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) జిల్లా అధ్యక్షులు బుర్ర వెంకన్న డిమాండ్ చేశారు. ఇల్లందు (Yellandu) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహసీల్దార్‌కు రైతాంగ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా అన్నదాతలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారని, అలాంటి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను తక్షణమే అమలు చేయాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతీ ఎకరానికి నీటి సౌకర్యం కల్పించాలని, రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటును అందించాలని డిమాండ్ చేశారు. రైతు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి ఏఐయూకేఎస్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని బుర్ర వెంకన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ మండల కమిటీ నాయకులు బానోత్ వీరన్న, ఇర్ప వెంకన్న, చిత్తులూరి బాలస్వామి, మోడెం రాంబాబు, బండి నారాయణ, వజ్జా వీరభద్రం, శ్రీరామ్ సంపత్, భూక్య శీను తదితరులు పాల్గొన్నారు.

