కలం, కరీంనగర్ బ్యూరో: కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచేందుకు 1920లో మొట్ట మొదటి కార్మిక సంఘంగా ఏఐటీయూసీ ఆవిర్భవించిందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) అన్నారు. బుధవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల లోగోను మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్‌గా కూడా వ్యవహరిస్తున్న చాడ వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. ప్యాట్రన్ కలవేన శంకర్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కార్మిక వర్గానికే కంచుకోటగా నిలిచే కరీంనగర్ జిల్లాలో సెప్టెంబర్‌లో ఏఐటీయూసీ మహాసభలు జరగనున్నాయని వివరించారు. కార్మిక వర్గం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునేందుకు కరీంనగర్ వేదిక అవుతుందని, ఈ మహాసభల విజయవంతానికి ఉమ్మడి జిల్లా కార్మిక వర్గం, దాని అనుబంధ సంఘాలు చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
రైతులకు అనేక ఇబ్బందులు..
రైతులు కష్టపడి పండించిన పంటలను అమ్ముకునే సమయంలో ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. తీవ్రమైన ఎండలతో రాష్ట్రంలో ఇప్పటివరకు 100 మందికి పైగా వడదెబ్బతో మృతి చెందారని వివరించారు. రైతులు ఎండకు ఎండుతూ, వర్షానికి నానుతూ అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరతపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎఫ్‍సీఐ గోడౌన్లలో నిల్వ ఉంచేలా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు చొరవ చూపాలన్నారు.
బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ పాలన..
సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తోందని చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను మరోలా చూస్తూ వివక్ష చూపిస్తోందన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల పై పెను భారం వేసిందన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు మొండి బకాయిలు మాఫీ చేస్తూ, సబ్సిడీలను వారికే ఇస్తూ మేలు చేస్తోందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆహ్వాన సంఘం నాయకులు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, కాశెట్టి లక్ష్మయ్య, పిట్టల సమ్మయ్య, వెల్దండి దామోదర్, పిట్టల శ్రీనివాస్, బెజ్జంకి కాళిదాస్, అల్లేపు రాజు, కేంసారం నర్సయ్య, పి.శ్రీనివాస్, జక్కుల ఆగయ్య, బాగోతం వీరయ్య, తిరుపతి, పి.కొమురయ్య, గందే కొమురయ్య, మహేందర్, సంపత్ పాల్గొన్నారు.
Read Also: ఇందిరమ్మ ఇండ్లు.. కేటీఆర్‌కు మంత్రి పొన్నం సవాల్!
Follow Us On : WhatsApp

