నిర్మల్ కాంగ్రెస్‌‌లో మండల అధ్యక్షుల నియామకాల లొల్లి

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని (Nirmal Congress) బలోపేతం చేయాలనే లక్ష్యంతో డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రకటించిన మండల అధ్యక్షుల జాబితా పార్టీలో అంతర్గత అసంతృప్తికి దారితీసింది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిన తర్వాత జిల్లాలో మండల అధ్యక్షుల నియామకాలు చేపట్టగా, పదవుల పంపకంలో పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు కాకుండా పైరవీలకు ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పార్టీకి విధేయులుగా పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని ఆశించిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ జాబితాతో నిరాశకు గురయ్యారు. పార్టీ కోసం పదేళ్లపాటు ప్రతిపక్షంలో నిలబడి పనిచేసిన తమను పక్కనబెట్టి, ఇటీవల పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెట్టడంపై వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సారంగాపూర్, నిర్మల్ రూరల్ అధ్యక్షులను మార్చాలని డిమాండ్

మంగళవారం ప్రకటించిన మండల అధ్యక్షుల నియామకాల్లో ఒక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపిస్తూ ప్రత్యర్థి వర్గం నిరసన వ్యక్తం చేసింది. సారంగాపూర్ మండల అధ్యక్షుడిగా కొత్తపల్లి మాధవరావు, నిర్మల్ రూరల్ మండల అధ్యక్షుడిగా పోలాస మల్లేష్ నియామకాలను వ్యతిరేకిస్తూ సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హదీల్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన వర్గానికి చెందిన నాయకులకే ఈ పదవులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన సీనియర్ నాయకులను విస్మరించి, ఇటీవల చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

నిర్మల్ పట్టణ అధ్యక్షుడి ఎంపికలో చివరి నిమిషంలో మార్పు

నిర్మల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో చివరి నిమిషంలో మార్పు చోటుచేసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు వర్గానికి చెందిన అయ్యన్నగారి పోశెట్టి పేరును ప్రతిపాదించినప్పటికీ, చివరకు ఆకుల హరీష్‌ను పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ డీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు.

ఈ పరిణామంలో కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నిర్మల్ నియోజకవర్గంలో శ్రీహరి రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సముద్రాల వేణుగోపాల చారి వర్గాలుగా పార్టీ కార్యకర్తలు విడిపోయిన పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ముధోల్ నియోజకవర్గంలోనూ వర్గపోరు

ముధోల్ నియోజకవర్గంలో కూడా మండల అధ్యక్షుల నియామకం రాజకీయ చర్చకు దారితీసింది. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వర్గాల మధ్య ఇప్పటికే విభేదాలు కొనసాగుతున్నాయి. కుంటాల మండలానికి ఆనందరావు పటేల్, భైంసా మండలానికి గజానంద్, బాసరకు లక్ష్మణరావు నారాయణరావు పటేల్ వర్గానికి చెందిన వారిగా భావిస్తుండగా, కుబీర్‌కు మైపాల్ రెడ్డి, తానూరుకు పుండలీక్ రావు, లోకేశ్వరానికి ముత్త గౌడ్, భైంసా పట్టణానికి అరవింద్ విఠల్ రెడ్డి వర్గానికి చెందిన వారిగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బలహీనంగా ఉన్న నేపథ్యంలో మండల అధ్యక్షుల నియామకాలతో వర్గ విభేదాలు మరింత పెరిగి పార్టీకి రాజకీయంగా నష్టం జరిగే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని కొందరు నాయకులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>