Mobile Popup Ad
Mobile Popup Ad

జ్యేష్ఠ పౌర్ణమి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

కలం, యాదగిరిగుట్ట: జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి (Yadagirigutta Temple) భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతోపాటు వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో యాదగిరీశున్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి గుట్టకు భక్తులు తరలి వచ్చారు. భక్తుల రాకతో స్వామి వారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. ఆలయ మాడ వీధులు, క్యూలైన్లు, శ్రీసత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరణి తదితర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ దృష్ట్యా స్వామి వారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

సెలవుల చివరి రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తజనసందోహంగా మారాయి. భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో కొండపైన ఉన్న ధర్మ దర్శనం క్యూలైన్లు, ప్రత్యేక దర్శన మార్గాలు, ప్రసాదాల విక్రయ కౌంటర్లు పూర్తిగా కిటకిటలాడుతున్నాయి. అలాగే కొండ కింద ఉన్న సత్యనారాయణ స్వామి వ్రత మండపాల్లో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కొండపైన పార్కింగ్ స్థలం కొరత, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొండపైకి ప్రైవేట్ వాహనాల అనుమతిని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం వి.ఐ.పి, వి.వి.ఐ.పి వాహనాలకు మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తున్నారు. సామాన్య భక్తుల వాహనాల కోసం కొండ కిందనే విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పార్క్ చేసిన భక్తులను ఆర్టీసీ ఉచిత బస్సుల (ఫ్రీ బస్సులు) ద్వారా కొండపైకి సురక్షితంగా చేరవేస్తున్నారు.

భక్తులకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం..

 వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం పెద్ద ఎత్తున షామియానాలు (షెడ్లు) ఏర్పాటు చేయడంతో పాటు, నిరంతరం చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. సాయంత్రం వరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ, సిబ్బంది, పోలీసులు గట్టి నిఘా, ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

బస్సులు పెంచాలని భక్తుల విజ్ఞప్తి..

భక్తులు అధికంగా రావడంతో యాదాద్రి కొండపై వాహనాల పార్కింగ్ నిండిపోయింది. దీంతో వాహనదారులు కొండమీదకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. వాహనాలను కొండ కింద పార్క్ చేసి వెళ్తామనుకున్నా, సరిపడా బస్సులు లేక పోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం సెలవు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. ఈ సమయంలో బస్సులు పెంచాలని అధికారులను భక్తులు ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>